Biryani: రాత్రి 10:30 గంటల కల్లా 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లు: స్విగ్గీ

కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఆహార ప్రియులు అత్యధికంగా బిర్యానీని ఆరగించినట్లు స్విగ్గీ గణాంకాల ద్వారా తెలుస్తోంది. అందులోనూ హైదరాబాదీ బిర్యానీకి ఉన్న క్రేజ్‌ మరోసారి నిరూపితమైంది.

Updated : 01 Jan 2023 13:01 IST

హైదరాబాద్‌: కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా శనివారం రాత్రి 10.25 గంటల సమయానికి దేశవ్యాప్తంగా 3.50 లక్షల బిర్యానీ (Biryani) ఆర్డర్లను డెలివరీ చేసినట్లు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ తీసుకొని ఇంటికి ఆహారం తెచ్చిచ్చే సంస్థ స్విగ్గీ  (Swiggy) తెలిపింది. అదే సమయంలో 61,000 పిజ్జాలను సైతం కస్టమర్లకు అందించినట్లు పేర్కొంది.

ట్విటర్‌లో నిర్వహించిన ఓ పోల్‌ ప్రకారం.. శనివారం అందిన ఆర్డర్లలో 75.4 శాతం మంది హైదరాబాదీ బిర్యానీనే ఆర్డర్‌ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. అలాగే మరో 14.2 శాతం మంది లఖ్‌నవీ బిర్యానీ, 10.4 శాతం మంది కోల్‌కతా బిర్యానీని తెప్పించుకున్నట్లు పేర్కొంది. అత్యధికంగా డెలివరీ చేసిన ఆహార పదార్థాల్లో బిర్యానీయే టాప్‌లో ఉందని తెలిపింది. శనివారం సాయంత్రం 7.20 గంటల సమయానికే 1.65 లక్షల బిర్యానీలను డెలివరీ చేసినట్లు పేర్కొంది.

హైదరాబాద్‌లో బిర్యానీకి అత్యంత ప్రాచుర్యం పొందిన ‘బావర్చి’ రెస్టారెంట్‌ శనివారం రోజు నిమిషానికి రెండు బిర్యానీలు డెలివరీ చేయడం గమనార్హం. డిమాండ్‌ను అందుకునేందుకు ఈ రెస్టారెంట్‌ 15 టన్నుల బిర్యానీని సిద్ధం చేసినట్లు స్విగ్గీ తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా డోమినోస్‌ ఇండియాకు చెందిన 61,287 పిజ్జాలను శనివారం డెలివరీ చేసినట్లు తెలిపింది. సాయంత్రం 7 గంటల సమయానికి 1.76 లక్షల చిప్స్‌ ప్యాకెట్లకు ఆర్డర్‌ అందినట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ తెలిపింది. అలాగే 9.18 గంటల వరకు 12,344 మంది కిచిడీ ఆర్డర్‌ చేసినట్లు వెల్లడించింది. మరోవైపు 2,757 డ్యురెక్స్‌ కండోమ్‌లను కూడా డెలివరీ చేసినట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని