ChatGPT ఫౌండర్‌ సవాల్‌ను స్వీకరించిన టెక్‌ మహీంద్రా సీఈఓ!

భారత స్టార్టప్‌లు చాట్‌జీపీటీ తరహా ఫౌండేషనల్‌ మోడల్‌ను సృష్టించడం కష్టమని దాన్ని అభివృద్ధి చేసిన కంపెనీ సీఈఓ శామ్‌ ఆల్టమన్‌ పరోక్షంగా సవాల్‌ విసిరారు. దీన్ని స్వీకరిస్తున్నట్లు టెక్‌ మహీంద్రా సీఈఓ గుర్నాని అన్నారు.

Published : 10 Jun 2023 14:52 IST

దిల్లీ: టెక్‌ ప్రపంచంలో ఇప్పుడు కృత్రిమ మేధ (Artificial Intelligence- AI)పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. చాట్‌జీపీటీ (ChatGPT) వచ్చిన తర్వాత ఈ రంగంలో పరిశోధనలు మరింత ఊపందుకున్నాయి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ సహా అన్ని కంపెనీలు తమ ఏఐ ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి. ఈ తరుణంలో చాట్‌జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్‌ఏఐ (OpenAI) కంపెనీ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman) భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా గూగుల్‌ ఇండియా మాజీ ఉపాధ్యక్షుడు రంజన్ ఆనందన్‌ ఆల్ట్‌మన్‌ను ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు.

భారత్‌లో అంకుర సంస్థలకు అనువైన వాతావరణం ఉందని రంజన్‌ అన్నారు. వీటిలో ఏదైనా స్టార్టప్‌ చాట్‌జీపీటీ (ChatGPT) తరహా ‘ఫౌండేషనల్‌ మోడల్‌’ను అభివృద్ధి చేసే అవకాశం మీకేమైనా కనిపిస్తుందా? అని ఆల్ట్‌మన్‌ను రంజన్‌ ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. ఫౌండేషనల్‌ మోడల్స్‌ను అభివృద్ధి చేయడంలో తమతో పోటీ పడడం వృథా అని అభిప్రాయపడ్డారు. నిరాశజనక ఫలితాలే అందుకుంటారంటూ ఒకరకంగా సవాల్‌ విసిరారు. పరోక్షంగా చాట్‌జీపీటీ తరహా మోడల్స్‌ను అభివృద్ధి చేయడం భారత్‌ స్టార్టప్‌లతో సాధ్యం కాకపోవచ్చునని వ్యాఖ్యానించారు.

దీనిపై తాజాగా టెక్‌ మహీంద్రా సీఈఓ సి.పి.గుర్నానీ (Tech Mahindra CEO) స్పందించారు. తమతో పోటీపడడం వల్ల భారత కంపెనీలు నిరాశాజనక ఫలితాలే అందుకుంటాయని ఆల్ట్‌మన్‌ అంటున్నారని అన్నారు. దీన్ని ఓ సీఈఓ విసిరిన సవాల్‌గా భావిస్తున్నానన్నారు. మరో సీఈఓనైన తాను ఆ సవాల్‌ను స్వీకరిస్తున్నానని ట్వీట్‌ చేశారు. మరోవైపు రంజన్‌ ఆనందన్‌ సైతం ఆల్ట్‌మన్‌ వ్యాఖ్యలపై స్పందించారు. భారత పారిశ్రామికవేత్తలను ఎప్పటికీ తక్కువ అంచనా వేయొద్దని చరిత్ర చెబుతోందన్నారు. ఏదేమైనప్పటికీ.. చాట్‌జీపీటీ తరహా మోడల్స్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని