Auto Industry: ఇలాగైతే భారత వాహన పరిశ్రమ వృద్ధి కష్టం.. మారుతీ సుజుకీ ఛైర్మన్‌

భారత్‌లో వాహన పరిశ్రమపై విధిస్తున్న పన్నులపై మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ పెదవి విరిచారు. ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే వృద్ధి కష్టమని అభిప్రాయపడ్డారు.

Published : 20 Dec 2022 15:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత వాహన పరిశ్రమలో కీలక విభాగం అయిన చిన్న కార్లపై నియంత్రణా భారం అధికంగా ఉందని మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఇండియా ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ (RC Bhargava) తెలిపారు. అలాగే అన్ని విభాగాల వాహనాలపై ఏకరీతి పన్ను (Uniform Tax) వ్యవస్థ ఉందని తెలిపారు. దీనివల్ల వాహన రంగ (Auto Industry) వృద్ధికి మేలు జరగదని పేర్కొన్నారు. చిన్న కార్ల కొనుగోళ్లు పూర్వస్థాయిలో జరగడం లేదన్నారు. ఇది వాహన పరిశ్రమ (Auto Industry)తో పాటు దేశానికీ మంచిది కాదని సోమవారం ఓ కార్యక్రమంలో అన్నారు.

భారత తయారీ రంగం వేగంగా వృద్ధి చెందితేనే దేశ ఆర్థిక వృద్ధి రేటు పరుగులు పెడుతుందని భార్గవ (RC Bhargava) అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతున్నప్పటికీ అంతగా ఫలితాలు రావడం లేదన్నారు. క్షేత్రస్థాయి అమలులో లోపాలే దీనికి కారణమన్నారు. వాహన పరిశ్రమలో ఆరోగ్యకరమైన వృద్ధి నమోదు కావాల్సిన అవసరం ఉందన్నారు. కార్ల కొనుగోలులో కొత్త కస్టమర్ల సంఖ్య పెరిగితేనే అది సాధ్యమవుతుందన్నారు. ఫలితంగా మొత్తం కార్లు వినియోగించేవారి సంఖ్య పెరిగి మొత్తం పరిశ్రమకు ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రస్తుతం పెద్ద కార్ల విభాగాల్లో మాత్రమే వృద్ధి కనిపిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల్లో ఏకరీతి పన్ను వ్యవస్థ ఉండడం సరికాదన్నారు.

ప్రస్తుతం, ఆటోమొబైల్స్‌పై 28 శాతం జీఎస్‌టీతో పాటు వాహన రకాన్ని బట్టి 1 శాతం నుంచి 22 శాతం వరకు అదనపు సెస్సు విధిస్తున్నారు. ‘పూర్తిగా తయారు చేసిన యూనిట్లు’గా (CBU) దిగుమతి చేసుకున్న కార్లపై ఇంజిన్ పరిమాణం, ధర, బీమా, రవాణా (CIF).. అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని 60 శాతం నుంచి 100 శాతం మధ్య కస్టమ్స్ సుంకాన్ని విధిస్తున్నారు.

విద్యుత్తు వాహనాల (Electric Vehicles) విషయానికి వస్తే చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని రకాల కార్లపై 5 శాతం జీఎస్టీ (GST) విధిస్తున్నారని భార్గవ గుర్తుచేశారు. దీంతో ఇక్కడ కూడా ఏకరీతి పన్ను వ్యవస్థ అమలవుతోందన్నారు. ఆటో రంగంపై ఇలా భారీ పన్నుల వల్లే పరిశ్రమ వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతోందని తెలిపారు. భారత్‌లో వాహన పరిశ్రమను ఎప్పుడూ అత్యధిక పన్ను పరిధిలోనే కొనసాగిస్తూ వచ్చారన్నారు. 50 శాతం పన్నులతో పరిశ్రమ వృద్ధి కాంక్షించడం ఏమాత్రం సరికాదన్నారు. ఈ అంశాన్ని పూర్తిగా పాలకులు, రాజకీయ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నామని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని