Twitter- Elon Musk: మస్క్‌.. మీ ఆలోచన సరైంది కాదు!

ఎలాన్‌ మస్క్‌కు ట్విటర్‌ ఉద్యోగులు లేఖ రాశారు. సిబ్బందిని తొలగించాలనే ఆలోచన సరైంది కాదని తెలిపారు. అలా చేస్తే కంపెనీ కార్యకలాపాలు దెబ్బతింటాయని హెచ్చరించారు.

Updated : 25 Oct 2022 14:57 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ కొనుగోలు ఒప్పందంలో నెలకొన్న సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ వ్యవహారంపై కంపెనీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ను సొంతం చేసుకుంటే దాదాపు 75 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆందోళన చెందిన ఉద్యోగులు కంపెనీ యాజమాన్యాన్ని వివరణ కోరారు. తాజాగా కొంతమంది ఎలాన్‌ మస్క్‌కు బహిరంగ లేఖ రాశారు. 

సిబ్బందిని తొలగించాలన్న మస్క్‌ నిర్ణయం అనాలోచితమైందని ఉద్యోగులు లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల ప్రజల సమాచార బట్వాడాకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని వ్యాఖ్యానించారు. ట్విటర్‌పై యూజర్లకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసినట్లేనని తెలిపారు. పైగా ఉద్యోగులపై బహిరంగ బెదిరింపులకు దిగుతున్నట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు. ఇలా నిరంతర వేధింపుల మధ్య పని చేయడం కష్టతరమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రస్తుత, భవిష్యత్తు యాజమాన్యం ముందు ఉద్యోగులు కొన్ని కీలక డిమాండ్లను ఉంచారు.

ఉద్యోగులను తొలగించే విషయంలో కంపెనీలో న్యాయబద్ధమైన విధానాలు ఉండాలని లేఖలో డిమాండ్‌ చేశారు. అలాగే ప్రస్తుతం ట్విటర్‌ యాజమాన్యం కల్పిస్తున్న ‘ఇంటి నుంచి పని’ వంటి ప్రయోజనాలన్నింటినీ కొనసాగించాలని మస్క్‌ను కోరారు. ట్విటర్‌ను నడిపే విషయంలోనూ కంపెనీ ఉద్యోగులు, మస్క్‌ మధ్య సైద్ధాంతికపరమైన వ్యత్యాసం ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే జాతి, జెండర్‌, వైకల్యం, రాజకీయ అభిప్రాయాల ఆధారంగా ఉద్యోగులపై పక్షపాతం చూపించొద్దని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని