UPI: ఈకామర్స్‌ చెల్లింపుల్లో యూపీఐ హవా.. తగ్గుతున్న డెబిట్‌ కార్డుల వినియోగం!

UPI: ఈకామర్స్‌లో డెబిట్‌ కార్డుల ద్వారా చేసే లావాదేవీల విలువ మొత్తం 2022 ఏప్రిల్‌లో రూ.21,000 కోట్లుగా నమోదైంది. ఆ మొత్తం 2023 నవంబరులో రూ.16,127 కోట్లకే పరిమితమైంది. 

Published : 26 Oct 2023 12:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో చెల్లింపులకు ‘యూనిఫైడ్‌ పేమెంట్స్ ఇంటర్ఫేస్‌ (UPI)’ వినియోగదారుల తొలి ప్రాధాన్యంగా మారుతోది. దీంతో డెబిట్‌ కార్డు (Debit cards)ల వాడకం క్రమంగా తగ్గుతున్నట్లు ఆర్‌బీఐ తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఈకామర్స్‌ పుంజుకుంటున్న నేపథ్యంలో చాలా మంది ఆన్‌లైన్‌ లావాదేవీలకు యూపీఐ (UPI) చెల్లింపుల వైపే మొగ్గుచూపుతున్నారు.

గత ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర బ్యాంకు ఈకామర్స్‌, ఆఫ్‌లైన్‌ మర్చంట్‌ స్వైప్‌లను విభజించడం ప్రారంభించింది. ఆ సమయంలో ఈకామర్స్‌లో డెబిట్‌ కార్డు (Debit cards)ల లావాదేవీల సంఖ్య 117 మిలియన్లుగా నమోదైంది. ఆ సంఖ్య 2023 సెప్టెంబర్‌ నెలలో సగానికి పైగా తగ్గి 51 మిలియన్లకు పడిపోయింది. అదే సమయంలో లావాదేవీల విలువ మొత్తం రూ.21,000 కోట్ల నుంచి రూ.16,127 కోట్లకు తగ్గింది. ముఖ్యంగా యూపీఐ (UPI) ద్వారా వ్యాపారులకు చేసే చెల్లింపుల సంఖ్య 2.2 బిలియన్ల నుంచి 6.1 బిలియన్లకు ఎగబాకింది. తక్కువ మొత్తం చెల్లింపులకు చాలా మంది యూపీఐ (UPI) వైపే మొగ్గుచూపుతున్నారు. పెద్ద మొత్తంలో లావాదేవీలకి మాత్రమే నెట్‌ బ్యాంకింగ్‌ వైపు వెళ్తున్నారు.

ఈకామర్స్‌లో క్రెడిట్‌ కార్డు లావాదేవీల సంఖ్య 2022 ఏప్రిల్‌లో 107 మిలియన్లుగా నమోదయ్యాయి. అది 2023 సెప్టెంబరులో 22 శాతం పెరిగి 131 మిలియన్లకు చేరాయి. విలువ పరంగా చూస్తే రూ.65,652 కోట్ల నుంచి రూ.92,878 కోట్లకు పెరిగినట్లైంది. ఆఫ్‌లైన్‌ స్టోర్లలోనూ డెబిట్‌ కార్డు ద్వారా లావాదేవీల సంఖ్య తగ్గినప్పటికీ.. ఇంకా గణనీయ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. ఆఫ్‌లైన్‌ స్టోర్లలో డెబిట్‌ కార్డ్‌ (Debit cards) స్వైప్‌ల సంఖ్య 213 మిలియన్ల నుంచి 132 మిలియన్లకు తగ్గింది. యూపీఐ (UPI) చెల్లింపుల్లోని సరళత, క్రెడిట్‌ కార్డులపై ఆఫర్లు, డిజిటల్‌ చెల్లింపుల దిశగా ప్రభుత్వ ప్రోత్సాహం వంటి పరిణామాల వల్ల యూపీఐ (UPI) చెల్లింపులకు ఆదరణ పెరుగుతోందని నిపుణులు అంచనా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని