WAPCOS IPO: త్వరలో వాప్‌కోస్‌ పబ్లిక్‌ ఇష్యూ.. సెబీకి దరఖాస్తు

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ క‌న్సల్టెన్సీ స‌ర్వీసెస్ లిమిటెడ్ (వ్యాప్‌కోస్‌)’ ఐపీఓకు దరఖాస్తు చేసుకుంది....

Published : 26 Sep 2022 19:06 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ క‌న్సల్టెన్సీ స‌ర్వీసెస్ లిమిటెడ్ (WAPCOS Ltd)’ ఐపీఓకు దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు సోమవారం మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. సంస్థలో 25 శాతం వాటాకు సమానమైన 3.25 కోట్ల ప్రభుత్వ ఈక్విటీ వాటాలను విక్రయించనుంది. ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌, ఎస్‌ఎంసీ క్యాపిటల్స్‌ లిమిటెడ్‌ ఈ ఐపీఓకి లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

వాప్‌కోస్‌ కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రభుత్వ రంగం సంస్థ. నీటి వనరులు, విద్యుత్తు సహా ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో కన్సల్టెన్సీ, ఇంజినీరింగ్‌, నిర్మాణం వంటి సేవల్ని అందిస్తోంది. భారత్‌ సహా ఇతర దేశాలకూ ఈ సంస్థ కార్యకలాపాలు విస్తరించాయి. అఫ్గానిస్థాన్‌లో నిర్మించిన సల్మా డ్యామ్‌ పనులు ఈ సంస్థ ఆధ్వర్యంలోనే జరిగాయి. దాదాపు 30 దేశాల్లో ఈ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 11.35 శాతం పెరిగి రూ.2,798 కోట్లకు చేరింది. పాట్‌ ఆదాయం 14.47 శాతం వృద్ధి చెంది రూ.69.16 కోట్లుగా నమోదైంది. మార్చి 2022 నాటికి కంపెనీ ఆర్డర్‌ బుక్‌ విలువ రూ.2,533.93 కోట్లుగా.. నిర్మాణ ఒప్పందాల విలువ రూ.18,497.33 కోట్లుగా ఉంది.

పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.65 వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఓఎన్‌జీసీలో మైనారిటీ వాటా విక్రయం ద్వారా రూ.3,000 కోట్లు, ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారా రూ.20,557 కోట్లు సమీకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని