Russian oil: భారత్‌కు రష్యా చమురు.. పశ్చిమ దేశాలు హ్యాపీయే!

రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్‌ పెంచుకోవడం పట్ల పశ్చిమ దేశాలు సంతోషంగా ఉన్నాయని చమురు రంగ సంస్థ బీపీ చీఫ్‌ ఎకానమిస్ట్ స్పెన్సర్‌ డేల్‌ అన్నారు.

Published : 19 Apr 2023 00:30 IST

దిల్లీ: ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యా ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి పశ్చిమ దేశాలు ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించాయి. చమురు ధరపై పరిమితిని విధించాయి. మరోవైపు రష్యా ముడి చమురును తక్కువ ధరకే విక్రయించడానికి సిద్ధమైంది. డిస్కౌంట్‌ ధరలో చమురు దొరుకుతుండడంతో భారత్‌ తన దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. ఎప్పుడూలేని విధంగా రికార్డు స్థాయిలో చమురును ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటోంది. దీనిపై కొన్ని పశ్చిమ దేశాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి కూడా. వాస్తవంలో రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్‌ పెంచుకోవడం పట్ల పశ్చిమ దేశాలు సంతోషంగా ఉన్నాయని చమురు రంగ సంస్థ బీపీ చీఫ్‌ ఎకానమిస్ట్ స్పెన్సర్‌ డేల్‌ అన్నారు. దిల్లీ వచ్చిన ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.

‘‘రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్‌ పెంచుకోవడం ఎంతమాత్రం వారికి సమస్య కానే కాదు. రష్యన్ చమురు ప్రవాహాన్ని కొనసాగించడం ద్వారా కొరతను నివారించడం, అదే సమయంలో రష్యా అధిక ధరకు తన చమురును విక్రయించలేకపోవడం అనేది చమరు ధరపై పరిమితి విధించడం వెనుక ముఖ్య ఉద్దేశం. యూరోపియన్‌ దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్‌, చైనా తన దిగుమతులను పెంచుకోవడం ద్వారా కొరతను అధిగమించడంతో పాటు ధరల పెరుగుదలను నివారించడం సాధ్యమైంది’’ అని డేల్‌ అన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో రోజుకు సగటున 1 మిలియన్‌ బ్యారెల్స్‌ను భారత్‌ దిగుమతి చేసుకోగా.. ఆ సంఖ్య ఇప్పుడు 1.8 మిలియన్ల బ్యారెళ్లకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని