రుణం.. దరఖాస్తు తిరస్కరిస్తే...

ఇల్లు, కారు కొనాలనుకున్నప్పుడు బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటాం. అనుకోని అవసరం వచ్చినప్పుడు వ్యక్తిగత రుణాలూ సర్వసాధారణం. అన్నీ సరిగ్గానే ఉన్నా.. కొన్నిసార్లు బ్యాంకు మన రుణ దరఖాస్తును తిరస్కరించే అవకాశాలు లేకపోలేదు.

Published : 13 Jan 2023 00:48 IST

ఇల్లు, కారు కొనాలనుకున్నప్పుడు బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటాం. అనుకోని అవసరం వచ్చినప్పుడు వ్యక్తిగత రుణాలూ సర్వసాధారణం. అన్నీ సరిగ్గానే ఉన్నా.. కొన్నిసార్లు బ్యాంకు మన రుణ దరఖాస్తును తిరస్కరించే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి అనుభవం ఎదురైనప్పుడు ఏం చేయాలి?

డ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు రిటైల్‌ రుణాలకు గిరాకీ పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు వచ్చిన ప్రతి దరఖాస్తునూ నిశితంగా పరిశీలిస్తున్నాయి. రుణగ్రహీత విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాయి. మీరు రుణానికి దరఖాస్తు చేసినప్పుడు, దాన్ని తిరస్కరిస్తే.. ముందుగా దానికి  కారణాలను తెలుసుకోండి. సాధారణంగా బ్యాంకు/బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఈ విషయాన్ని స్పష్టంగానే తెలియజేస్తుంది. క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉండటం, ఆదాయం సరిపోకపోవడం, ఇప్పటికే ఆదాయంలో 50 శాతానికి మంచి వాయిదాలు ఉండటం, ఈఎంఐ ఆలస్యంగా చెల్లించడం, తరచూ ఉద్యోగాలు మారడం, కొంటున్న ఇంటి విషయంలో వివాదాలకు ఆస్కారంలాంటివి ప్రధానంగా కారణమవుతాయి. క్రెడిట్‌ నివేదికలో పొరపాట్ల వల్లా ఒక్కోసారి రుణ దరఖాస్తును తిరస్కరించే ఆస్కారం ఉంది.

క్రెడిట్‌ నివేదిక, స్కోరు సరిగా ఉండాలంటే.. వాయిదాలు సరైన సమయంలో చెల్లించాలి. 750కి మించి క్రెడిట్‌ స్కోరు ఉన్నప్పుడు రుణ దరఖాస్తును తిరస్కరించే అవకాశాలు తక్కువ. స్కోరు తక్కువగా ఉన్న కారణంతోనే దరఖాస్తు వెనక్కి వస్తే.. స్కోరు పెంచుకునే ప్రయత్నం చేయాలి. వాయిదాలు, క్రెడిట్‌ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించడం ద్వారా క్రమంగా స్కోరు పెరుగుతుంది. కొన్ని రోజులపాటు క్రెడిట్‌ కార్డులను తక్కువగా వాడాలి. ఇప్పటికే ఉన్న పాత క్రెడిట్‌ కార్డులను రద్దు చేసుకోవద్దు. కొత్త కార్డులకు దరఖాస్తు చేయడం వల్ల స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే ఉన్న రుణాలు, వాటికి చెల్లిస్తున్న ఈఎంఐల లెక్కలూ కొత్త రుణ సంస్థ చూస్తుంది. మీ మొత్తం ఆదాయంలో 45-50 శాతానికి మించకుండా ఈఎంఐ ఉండాలి. ఇప్పటికే మీ ఆదాయంలో వాయిదాల నిష్పత్తి ఈ స్థాయికి చేరుకుంటే.. బ్యాంకులు కొత్త రుణం ఇచ్చేందుకు ఆలోచిస్తాయి.

రుణం లేదా క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ ఆ వివరాలు క్రెడిట్‌ నివేదికలో నమోదవుతాయి. స్వల్పకాలంలోనే ఎక్కువ రుణాలకు దరఖాస్తు చేసుకోవడం ఎప్పుడూ మంచిది కాదు. ఒకసారి దరఖాస్తు తిరస్కరిస్తే.. ఆ తర్వాతా ఇదే పునరావృతం అవుతుంది. అందుకే, ఒకేసారి రెండు మూడు రుణ సంస్థలను సంప్రదించకూడదు. ఇలా చేయడం వల్ల రుణాల కోసం ఆరాటపడుతున్నారని రుణ సంస్థలు భావిస్తాయి. అది మీకు ఇబ్బందిగా మారుతుంది.

క్రెడిట్‌ స్కోరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు నెలకోసారైనా దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా సంస్థలు దీన్ని ఉచితంగానే అందిస్తున్నాయి. ఈ నివేదికలో మీ రుణాలకు సంబంధించిన అన్ని లావాదేవీలూ ఉంటాయి.

స్కోరు 750 వచ్చే వరకూ ఆశించిన మేరకు క్రెడిట్‌ స్కోరు లేని కారణంతో దరఖాస్తును తిరస్కరిస్తే.. వెంటనే కొత్త రుణం కోసం వెళ్లకూడదు. స్కోరు పెరిగేందుకు కనీసం 4-12 నెలలు వేచి చూడాలి. ఇప్పటికే మీకు 750 స్కోరు ఉంటే.. తక్కువ సమయంలోనే ఇది పెరుగుతుంది. వాయిదాలు, బిల్లులను సకాలంలో చెల్లించడం ద్వారా సులువుగా స్కోరు మెరుగవుతుంది. అన్నీ సానుకూలంగా ఉన్నాయి అనుకున్నప్పుడే కొత్త రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం మేలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని