WhatsApp: వాట్సాప్‌లో షేర్‌ ఇట్‌ తరహా ఫీచర్‌.. ట్రాన్స్‌ఫర్‌ ఇకపై సులభంగా...

WhatsApp Chat Transfer: చాట్స్‌, అందులోని డేటాను సులభంగా ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి వాట్సాప్‌ (WhatsApp) కొత్త ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది.

Published : 01 Jul 2023 17:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీ వాట్సాప్‌ (WhatsApp) చాట్స్‌, ఫైల్స్‌, ఫొటోస్‌, వీడియోస్‌ బ్యాకప్‌ తీసుకుందామంటే.. మీ డ్రైవ్‌ సైజ్‌ సరిపోవడం లేదా? దీంతో కొత్త మొబైల్‌లోకి ఆ డేటా ట్రాన్స్‌ఫర్‌ చేయలేకపోతున్నారా? అయితే మీ కోసం వాట్సాప్‌ ఓ ఆప్షన్‌ తీసుకురాబోతోంది. క్లౌడ్‌/ డ్రైవ్‌ బ్యాకప్‌ అవసరం లేకుండా పాత మొబైల్‌ నుంచి కొత్త మొబైల్‌కు డేటాను ట్రాన్స్‌ఫర్‌ (WhatsApp Chat Transfer) చేసుకోవచ్చు. అది కూడా కేవలం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారానే. ఈ మేరకు ఓ ఫీచర్‌ను సిద్ధం చేస్తున్నారు. 

వాట్సాప్‌ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్‌ షేర్‌ ఇట్‌ తరహాలోనే జరుగుతుంది. రెండు మొబైల్స్‌ ఒకే నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ అయి ఉంటే చాలు.. డేటా సులభంగా ట్రాన్స్‌ఫర్‌ చేసేయొచ్చు. వైఫై డైరెక్ట్‌ సాంకేతికత ఆధారంగా ఈ ప్రక్రియ జరగనుంది. షేర్‌ ఇట్‌ యాప్‌ను వాడిన వాళ్లకు ఈ ఫీచర్‌ వినియోగించడం చాలా సులభం అని చెప్పొచ్చు. 

ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఫీచర్‌ను వాట్సాప్‌ మాతృ సంస్థ మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఓ వీడియోలో చేసి చూపించారు. చిటికెలో చాట్స్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చని తెలిపారు. దీని కోసం WhatsApp -> Chats -> Chat transfer ఆప్షన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.  అక్కడ క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ ఓపెన్‌ అవుతుంది. దాంతో కొత్త మొబైల్‌లోని వాట్సాప్‌ యాప్‌లో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే  పాత మొబైల్‌లోని వాట్సాప్‌ డేటా మొత్తం కొత్త ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ అయిపోతుంది. 

అయితే ఈ విధానం ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేసిన చాట్‌ హిస్టరీ పూర్తిగా ఎన్‌క్రిప్ట్‌ మోడ్‌లో ఉంటుందని, ఆ సమాచారం ఇతరులకు షేర్‌ అయ్యే అవకాశం లేదని వాట్సాప్‌ తెలిపింది. క్లౌడ్‌ స్టోరేజీలో సేవ్‌ చేయలేనంత పెద్ద వాట్సాప్‌ బ్యాకప్‌ ఉన్నవాళ్లకు ఈ ఆప్షన్‌ ఉపయోగపడుతుందని పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని