Train Ticket: రైలు ప్రయాణం రద్దు చేసుకుంటున్నారా.. టికెట్‌ను కుటుంబసభ్యులకు బదిలీ చేయొచ్చు!

Train Ticket Transfer: తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే టికెట్‌ను మీ సమీప కుటుంబ సభ్యులకు బదిలీ చేయొచ్చు. అయితే, ఇది రైల్వేశాఖ నిర్దేశించిన సమయంలోగా పూర్తవ్వాలి.

Updated : 18 Oct 2022 17:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో మనం రైలు ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తుంటుంది. అలాంటప్పుడు డబ్బులు కోల్పోవాల్సి రావచ్చు. కానీ, అలా జరగకుండా ఉండేందుకు రైల్వే శాఖ ఓ సదుపాయం కల్పిస్తోంది. మన టికెట్‌ను మన సమీప కుటుంబ సభ్యుల పేరు మీదకు బదిలీ చేయొచ్చు. తండ్రి, తల్లి, సోదరి, సోదరుడు, కూతురు, కొడుకు, భర్త, భార్య.. వీరికి మాత్రమే టికెట్‌ను బదిలీ చేసేందుకు వీలుంటుంది.

ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే కనీసం 24 గంటల ముందు రైల్వే శాఖకు అర్జీ పెట్టుకోవాలి. టికెట్‌ కన్ఫర్మ్‌ అయినవారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. ఈ సదుపాయాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకునేందుకు వీలుంది. అంటే ఒకసారి బదిలీ చేసిన టికెట్‌ మరోసారి వేరే వాళ్ల పేరు మీదకు మార్చలేం. ఎవరైతే బదిలీ చేసుకున్న టికెట్‌ ద్వారా ప్రయాణిస్తారో.. వారు తప్పనిసరిగా ముందు టికెట్‌ బుక్‌ చేసుకున్నవారి గుర్తింపు పత్రాలను వెంట తీసుకెళ్లాలి.

ఇదీ టికెట్‌ బదిలీ ప్రక్రియ..

  • కన్ఫర్మ్‌ అయిన టికెట్‌ ప్రింటవుట్‌ తీసుకోవాలి.
  • ఎవరి పేరు మీదకైతే టికెట్‌ను బదిలీ చేయాలనుకుంటున్నారో వారి ఆధార్‌ కార్డుగానీ, ఓటర్‌ గుర్తింపు కార్డుగానీ ఉండాలి.
  • మీకు దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్‌ టికెట్‌ రిజర్వేషన్‌ కౌంటర్‌కు వెళ్లాలి.
  • అక్కడ టికెట్‌ను బదిలీ చేయమని కోరుతూ అర్జీ సమర్పించాలి.

ఎంత సమయం ఉంటుంది?

భారత రైల్వేశాఖ వివరాల ప్రకారం.. రైలు బయలుదేరే సమయానికి 24 గంటల ముందే టికెట్‌ బదిలీకి సంబంధించి అర్జీ పెట్టుకోవాలి. అయితే, ఈ సమయం ప్రయాణికులను బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులైతే 24 గంటల ముందు చేసుకుంటే సరిపోతుంది. అదే పండుగ, పెళ్లి వంటి వ్యక్తిగత పనులపై వెళ్లే వారు మాత్రం 48 గంటల ముందే బదిలీ చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని