logo

గుర్తింపు ఎన్నికలపై కదలిక

సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల అంశంపై కదలిక వచ్చింది. కేంద్ర కార్మిక శాఖ ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్‌ అధికారిగా శ్రీనివాసరావును నియమించింది.

Updated : 03 Jun 2023 06:08 IST

13న సింగరేణి కార్మిక సంఘాలతో ఆర్‌ఎల్‌సీ భేటీ

శ్రీరాంపూర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల అంశంపై కదలిక వచ్చింది. కేంద్ర కార్మిక శాఖ ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్‌ అధికారిగా శ్రీనివాసరావును నియమించింది. గత మార్చిలోనే ఆయన ఎన్నికల నిర్వహణకు భేటీ కావాలని కార్మిక సంఘాలకు లేఖ రాశారు. అప్పుడు యాజమాన్యం మూడు నెలల గడువు కావాలని కోర్టును ఆశ్రయించింది. మే నెలతో గడువు ముగియడంతో చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు ఈ నెల 13న హైదరాబాద్‌లో జరిగే సమావేశానికి హాజరు కావాలని కార్మిక సంఘాలకు సమాచారం అందించారు.  

సంస్థలో చివరి సారిగా గుర్తింపు సంఘం ఎన్నికలు 2017 అక్టోబర్‌  5వ తేదీన నిర్వహించారు. ఇందులో గెలిచిన తెబొగకాసం కాలపరిమితి 2019 అక్టోబర్‌తో ముగిసింది. తమకు నాలుగేళ్ల కాలపరిమితి ఉందని కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు కోర్టులో నడుస్తుండగానే 2021 అక్టోబర్‌తో ఆ గడువు పూర్తయింది. కార్మికశాఖ ఇచ్చిన అధికారిక పత్రం ప్రకారం 2019లోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. కోర్టు కేసు, కరోనా ప్రభావంతో వీటిని నిర్వహించేందుకు యాజమాన్యం ముందుకు రాలేదు. కార్మిక సంఘాల ఒత్తిడి మేరకు కేంద్ర కార్మిక శాఖ ఉప కమిషనర్‌ స్పందించి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు యాజమాన్యం సిద్ధంగా ఉండాలని సూచించారు. వార్షిక సంవత్సరం మొదటి మూడు నెలలు ఉత్పత్తిపై ప్రభావం ఉంటుందని జూన్‌ తర్వాత వీటిని నిర్వహించేందుకు ఇబ్బంది లేదని కోర్టును ఆశ్రయించి గడువు పొందింది.

పార్టీలు, అనుబంధ సంఘాలకు ప్రతిష్ఠాత్మకం

ఈసారి జరిగే గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రధాన పార్టీలు, వాటి అనుబంధ సంఘాలకు ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతుండటంతో వీటికి ప్రాధాన్యం సంతరించుకొంది. గుర్తింపు ఎన్నికల్లో గెలుపొంది సింగరేణి ప్రాంతాల్లో తమ బలాన్ని మరింత పెంచుకోవాలని భారాస, కాంగ్రెస్‌, భాజపా, భాకపా పార్టీలు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాయి. వాటి అనుబంధ సంఘాలు తెబొగకాసం, ఐఎన్టీయూసీ, బీఎంఎస్‌, ఏఐటీయూసీ గనులపై ప్రచారాలు మొదలు పెట్టాయి. హెచ్చెమ్మెస్‌ ఎన్నికల వ్యూహంలో నిమగ్నమైంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధమేనంటూ అధికార, ప్రతిపక్ష సంఘాలన్నీ ఇప్పటికే సంకేతాలు పంపాయి. రోజూ గనులపై ద్వార సమావేశాలు నిర్వహిస్తూ కార్మికులను ఆకర్శించే ప్రయత్నాలు చేస్తున్నాయి. వేజ్‌బోర్డులో మెరుగైన ఒప్పందాలు చేసుకున్నామని జాతీయ సంఘాలు కార్మికుల ముందుకొస్తుంటే, ఒప్పందాలతో ఆర్థిక ప్రయోజనాలేవీ లేవని తెబొగకాసం వారికి వివరించే ప్రయత్నం చేస్తోంది. ఈ నెల 13న కార్మిక సంఘాలు ఆర్‌ఎల్‌సీతో జరిగే సమావేశం తర్వాతనే ఎన్నికల నిర్వహణపై స్పష్టత వస్తుంది. ఈ సమావేశంలోనే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశముందని కార్మికులు చర్చించుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని