logo

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

పట్టణంలోని శివాజీచౌక్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న లక్ష్మణ్‌ (25) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు పట్టణ సీఐ అనిల్‌ తెలిపారు.

Published : 28 Mar 2024 02:52 IST

లక్ష్మణ్‌

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని శివాజీచౌక్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న లక్ష్మణ్‌ (25) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు పట్టణ సీఐ అనిల్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. లోకేశ్వరం మండలం బాగాపూర్‌ గ్రామానికి చెందిన లక్ష్మణ్‌  కొద్దిరోజులుగా ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. రాత్రి విధుల్లో భాగంగా మంగళవారం ఆసుపత్రికి వచ్చారు. బుధవారం ఉదయం అతడు మృతిచెంది ఉండటం గమనించిన సిబ్బంది పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.  మృతదేహాన్ని జిల్లా బోధనాసుపత్రికి తరలించారు. ఈలోపు ఆసుపత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు ఆసుపత్రి వైద్యులను నిలదీశారు. విధినిర్వహణకు వచ్చిన వ్యక్తి అనుకోని రీతిలో ఎలా చనిపోతారని, తాము రాకముందే మృతదేహాన్ని ఎలా తరలిస్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకొని పరిస్థితి తీవ్రమయ్యేలా కనిపించింది. పట్టణ, గ్రామీణ, సోన్‌ సీఐలు అనిల్‌, శ్రీనివాస్‌, నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో అక్కడున్న వారికి సర్ది చెప్పారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపడుతామని, ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు సీఐ వివరించారు.

ప్రేమ వ్యవహారమేనా..?

జరిగిన ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమనే అనుమానాలు తలెత్తుతున్నాయి. లక్ష్మణ్‌ తాను పనిచేస్తున్న ఆసుపత్రిలోనే పనిచేసే యువతితో కొద్దిరోజులుగా సన్నిహితంగా ఉంటున్నారు. అయితే.. ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా మెలగడం చూసి తాను తట్టుకోలేకపోతున్నానని, ఇది జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ రాసిన లేఖను పోలీసులు గుర్తించారు. లేఖ అతడు రాసినదేనా, లక్ష్మణ్‌ మృతికి గల కారణాలు ఏమై ఉండొచ్చనే విషయమై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని