logo

Weapons: క్లిక్‌ చేస్తే కత్తి..

కత్తులు.. తల్వార్లు.. ప్రమాదకరమైన ఆయుధాలు ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో బహిరంగంగా విక్రయిస్తున్నారు.. వంటగదిలో ఉపయోగించే కత్తుల పేర్లతో ఆన్‌లైన్‌లో ప్రముఖ సంస్థలు అమ్మేస్తున్నాయి. వీటిని కొంటున్న యువకులు యువతులను

Updated : 11 Jul 2021 07:05 IST

 ఆన్‌లైన్‌లో ఆయుధ విక్రయాలకు అడ్డుకట్టేది?

 పుట్టినరోజు వేడుకలకు యువకులు.. బెదిరించేందుకు నేరస్థుల కొనుగోలు

ఈనాడు, హైదరాబాద్‌: కత్తులు.. తల్వార్లు.. ప్రమాదకరమైన ఆయుధాలు ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో బహిరంగంగా విక్రయిస్తున్నారు.. వంటగదిలో ఉపయోగించే కత్తుల పేర్లతో ఆన్‌లైన్‌లో ప్రముఖ సంస్థలు అమ్మేస్తున్నాయి. వీటిని కొంటున్న యువకులు యువతులను బెదిరిచేందుకు ఉపయోగిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం బండారి శ్రీకాంత్‌ అనే యువకుడు తన స్నేహితురాలిని బెదిరిచేందుకు జాంబియా కత్తిని తీసుకెళ్లాడు. ఇంతేకాదు.. పుట్టినరోజు వేడుకల్లో కొందరు విన్యాసాలు చేసేందుకు తల్వార్లు, కత్తులు కొంటున్నారు. దుకాణాల్లో వీటి అమ్మకాలపై నిషేధం ఉండడంతో గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇంటి చిరునామాకే ఆయుధాలు వస్తున్నాయని తెలుసుకుని కొందరు రౌడీషీటర్లు, వారి అనుచరులు కూడా కొంటున్నారు.

ఆత్మరక్షణ.. దాడులు చేసేందుకు..

కొందరు నేరస్థులు కత్తులు, తల్వార్‌లను ఆత్మరక్షణ కోసం కొంటున్నారు. యువకులు, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు వివాహ వేడుకల్లో తల్వార్‌, కత్తులతో ప్రదర్శనలు చేస్తున్నారు. ఒక వ్యక్తి తన బావమరిది, అతడి బంధువులు చంపేస్తారన్న భయంతో ఆన్‌లైన్‌ ద్వారా కత్తి కొన్నాడు. ఈ విషయాన్ని అతడి భార్యకు కూడా చెప్పలేదు. పాతబస్తీ, పశ్చిమమండలం పరిధుల్లో దొంగతనాలు చేస్తున్న నేరస్థులు రాత్రివేళల్లో బాధితులను భయపెట్టేందుకు కత్తి, డాగర్‌ను ఉపయోగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం హబీబ్‌నగర్‌ ఠాణా పరిధిలో ఓ నాయకుడి పుట్టిన రోజున అతడి అనుచరులు కత్తులు, తల్వార్లతో నృత్యాలు చేశారు. దీంతోపాటు ఆయుధాలు ధరించి ఫొటోలు తీసుకుని వాటిని అప్‌లోడ్‌ చేస్తున్నారు.

పోలీసులు హెచ్చరించినా..

పుట్టినరోజు వేడుకల్లో కత్తులతో కేకులు కోస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలు, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో వస్తున్న వీడియోలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సేకరిస్తున్నారు. గతంలో ఈ కత్తులు, తల్వార్లు వినియోగించిన 11 మందిని అరెస్ట్‌ చేశారు. వీరితో పాటు పాతబస్తీలో నివాసముంటున్న నేరస్థులు రవూఫ్‌, ముజీబ్‌, హుస్సేన్‌లనూ అరెస్ట్‌ చేశారు. వారు తెలిపిన వివరాల ఆధారంగా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో ఉన్న ఆ ఫొటోలు, వీడియోలను సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషించారు. వారు అప్‌లోడ్‌ చేసిన వీడియోల ఐపీ చిరునామాలను గుర్తించారు. వారి వాంగ్మూలం నమోదు చేసిన అనంతరం ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌లకు కత్తులు విక్రయించవద్దంటూ హెచ్చరించారు. తాఖీదులు పంపించారు. కొద్దిరోజుల పాటు ఆయా సంస్థలు వెనక్కి తగ్గినా.. వీటికి గిరాకీ అధికంగా ఉండడంతో చట్టపరమైన చిక్కులు రాకుండా విక్రయిస్తున్నారని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు