logo

Suicide: ప్రియురాలిని చేరలేక ప్రియుడి ఆత్మహత్య

ప్రియురాలి ఎడబాటు భరించలేక ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పహాడీషరీఫ్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై రమేష్‌ కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన వినీత్‌(22)

Updated : 02 Jan 2022 08:50 IST

పహాడీషరీఫ్‌, న్యూస్‌టుడే: ప్రియురాలి ఎడబాటు భరించలేక ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పహాడీషరీఫ్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై రమేష్‌ కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన వినీత్‌(22) మూడేళ్లక్రితం నగరానికి వలస వచ్చాడు. పలు చోట్ల పనులు చేసుకుంటూ మకాం మారుస్తున్నాడు. తాజాగా మంకాల శ్రీనగర్‌ కాలనీలోని హోటల్‌లో కార్మికుడిగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. మూడేళ్లక్రితం స్వస్థలంలో ఓ యువతి ప్రేమలో పడిన వినీత్‌ బాగా సంపాదించి తిరిగి వెళ్లి ఆమెను పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నాడు. కరోనా కాలంలో అతనికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. తనకోసం నిరీక్షిస్తున్న ప్రేయసితో నిత్యం చరవాణిలో మాట్లాడేవాడు. శనివారం సాయంత్రం పనులు ముగించుకుని గదికి వచ్చి ఆమెతో చరవాణిలో మాట్లాడాడు. ఏళ్లు గడుస్తున్నా తన వద్దకు తిరిగి రాలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మనస్తాపం చెందిన వినీత్‌ ఫోన్‌ పక్కన పడేసి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లి చెట్టుకు తాడుతో ఉరేసుకున్నాడు. ఇంతలో అతని గదికి వచ్చిన తోటి కార్మికులు అప్పటికీ లైన్‌లో ఉన్న ఆమెతో ఫోన్‌లో మాట్లాడారు. విషయం తెలుసుకుని వెతుక్కుంటూ వచ్చేసరికే వినీత్‌ మృతి చెందాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే చేరుకుని మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. ఎస్సై ప్రియురాలి చరవాణికి ఫోన్‌ చేసి విచారించగా వినీత్‌కు ఏమైందని ప్రశ్నిస్తూ కన్నీళ్ల పర్యంతమైంది. ప్రియుడు మృతిచెందిన సమాచారం ఆమెకు తెలపలేదని ఎస్సై పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని