logo

గంజాయి రవాణాకు.. పుష్ప మార్గం

గంజాయి తరలింపులోనూ ఓ ముఠా చాణక్యం ప్రదర్శించింది. అచ్చం పుష్ప సినిమా తరహాలో దాన్ని రవాణా చేస్తూ కటకటాలపాలయ్యారు. హైదరాబాద్‌ ఉప్పల్‌ ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్‌ టి.దేవి రవికాంత్‌, మల్కాజిగిరి జిల్లా డీపీఈఓ డి.అరుణ్‌కుమార్‌, ఏపీ అండ్‌ ఈఎస్‌ ముకుందరెడ్డి, ఉప్పల్‌ అబ్కారీ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌గౌడ్‌ మంగళవారం తెలిపిన వివరాలివి..

Published : 06 Jul 2022 02:40 IST

ఉప్పల్‌లో 440 కిలోల పట్టివేత.. విలువ రూ.కోటి


ఉప్పల్‌లో చిక్కిన గంజాయి ముఠాను చూపిస్తున్న అబ్కారీ అధికారులు దేవి రవికాంత్‌, అరుణ్‌కుమార్‌ ఇతర సిబ్బంది

ఉప్పల్‌, న్యూస్‌టుడే: గంజాయి తరలింపులోనూ ఓ ముఠా చాణక్యం ప్రదర్శించింది. అచ్చం పుష్ప సినిమా తరహాలో దాన్ని రవాణా చేస్తూ కటకటాలపాలయ్యారు. హైదరాబాద్‌ ఉప్పల్‌ ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్‌ టి.దేవి రవికాంత్‌, మల్కాజిగిరి జిల్లా డీపీఈఓ డి.అరుణ్‌కుమార్‌, ఏపీ అండ్‌ ఈఎస్‌ ముకుందరెడ్డి, ఉప్పల్‌ అబ్కారీ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌గౌడ్‌ మంగళవారం తెలిపిన వివరాలివి..

అనుమానం రాకుండా సినీ ఫక్కీలో..

ఏపీలోని కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన పెరపురెడ్డి అర్జున్‌(25), పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన నేరళ్ల కిరణ్‌కుమార్‌(26), హైదరాబాద్‌ ఫలక్‌నుమాకు చెందిన సయ్యద్‌ తహెర్‌(24)తో పాటు వీరేంద్రకుమార్‌, సందీప్‌, తేజ, ఫజల్‌ ముఠాగా ఏర్పడ్డారు. ఏపీలోని అరకు నుంచి చేపలు రవాణా చేసే ప్లాస్టిక్‌ డబ్బాల్లో గంజాయి ప్యాకెట్లను నింపి డీసీఎంలో విశాఖపట్నంకు తెచ్చారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు విశాఖపట్నంలో కొన్ని చేపల డబ్బాలను సైతం వాహనంలో ఎక్కించారు. విశాఖ నుంచి నేరుగా వరంగల్‌ వచ్చి అక్కడ చేపలు ఉన్న డబ్బాలను దించారు. అక్కడ నుంచి సోమవారం రాత్రి డీసీఎం ఉప్పల్‌ భగాయత్‌లోని హెచ్‌ఎండీఏ లే అవుట్‌కు చేరుకుంది. ఇక్కడి నుంచి మహారాష్ట్రలోని సాంగ్లి, సోలాపూర్‌కు తరలించేందుకు కారులోకి గంజాయి ప్యాకెట్లను ఎక్కిస్తున్నారు. పక్కా సమాచారంతో ఉప్పల్‌ ఆబ్కారీ పోలీసులు దాడి చేశారు. డబ్బాల్లో ఉన్న 440 కిలోల గంజాయి ప్యాకెట్లను, డీసీఎం వ్యాన్‌, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ రూ.కోటికి పైగానే ఉంటుంది. ముఠాలో అర్జున్‌, కిరణ్‌కుమార్‌, తహెర్‌ మాత్రమే పట్టుబడ్డారు. మిగతా నలుగురు పరారీలో ఉన్నారు. వీరిలో కిరణ్‌పై భద్రాచలం పోలీస్‌స్టేషన్‌లో గంజాయి రవాణా కేసు ఉంది. అందరిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌ కేంద్రంగా..

ఈ ముఠా హైదరాబాద్‌ కేంద్రంగా గంజాయి దందా చేస్తోంది. అరకు నుంచి హైదరాబాద్‌ వరకు పెద్ద వాహనాల్లో గంజాయి తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి రాత్రి వేళ కార్లల్లో మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్రకు తరలించే సమయంలోనే పక్కా సమాచారంతో ఉప్పల్‌ ఆబ్కారీ పోలీసులు పట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని