logo

వంచన.. దాడులు, మోసాలు

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో నవంబరులో పోకిరీల వేధింపులపై మహిళలనుంచి 98 ఫిర్యాదులు అందగా దర్యాప్తును పూర్తి చేసినట్లు షీ టీమ్స్‌ డీసీపీ కవిత తెలిపారు.

Published : 02 Dec 2022 02:24 IST

మహిళలపై నేరాలు ఇలా..
నిందితులపై షీ టీమ్స్‌ ఉక్కుపాదం

సైబరాబాద్‌ కమిషనరేట్‌లో పోకిరీలకు కౌన్సెలింగ్‌..

రాయదుర్గం, న్యూస్‌టుడే: సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో నవంబరులో పోకిరీల వేధింపులపై మహిళలనుంచి 98 ఫిర్యాదులు అందగా దర్యాప్తును పూర్తి చేసినట్లు షీ టీమ్స్‌ డీసీపీ కవిత తెలిపారు. అత్యధికంగా వాట్సప్‌లోే 74 ఫిర్యాదులు అందగా 9 మంది నేరుగా షీటీమ్స్‌ను ఆశ్రయించారు. 13 మంది ఊమెన్‌ సేఫ్టీ వింగ్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మెయిల్‌, క్యూఆర్‌కోడ్‌ ద్వారా ఒక్కొక్కరు సంప్రదించారు. వాటిలో ఫోన్‌ చేసి వేధించినవి 33, బ్లాక్‌మెయిలింగ్‌ 14, పెళ్లి పేరుతో మోసగించిన 12 ఫిర్యాదులూ ఉన్నాయి. 29 కేసుల్లో 4 క్రిమినల్‌ కేసులున్నాయి. ఒక బాల్య వివాహాన్ని అడ్డుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ చేశారు. 126 మంది పోకిరీలను అదుపులోకి తీసుకుని కుటుంబసభ్యుల ముందు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బాధితులు వాట్సప్‌ నంబరు 9490617444, డయల్‌ 100, సామాజిక మాధ్యమాల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని డీసీపీ తెలిపారు.

ప్రేమ పేరుతో..

రాయదుర్గానికి చెందిన ఓ వ్యక్తి తాను వ్యాపారినని, ప్రేమిస్తున్నట్లు చెప్పి ఓ మహిళను నమ్మించాడు. కొన్నాళ్ల తర్వాత ఆమెను అనుమానిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్నాడు. ఆమె కారునూ ధ్వంసం చేశాడు. బాధితురాలు మాదాపూర్‌ షీ టీమ్స్‌ను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.

ఫొటోలు, వీడియోలతో..

అల్వాల్‌లో ఓ వివాహిత చరవాణుల దుకాణం నిర్వహిస్తున్నారు. ఒక చరవాణి సంస్థలో టీమ్‌ లీడర్‌గా పనిచేసే గాజుల రామారం రోడామిస్త్రీనగర్‌వాసి సయ్యద్‌ రియాజ్‌ (32) తరచూ వచ్చి చరవాణుల అమ్మకాలపై వివరాలు సేకరించేవాడు. వేసవిలో ఇంట్లో ఏసీ, గీజర్లు పనిచేయని విషయాన్ని ఆమె తన భర్తకు చెబుతుండగా ఆ వ్యక్తి విని తాను మెకానిక్‌ తీసుకొచ్చి మరమ్మతులు చేయిస్తానన్నాడు. తర్వాత ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని, తనతో నగ్నంగా వీడియోకాల్‌ చేయాలని లేకపోతే వాటిని సామాజిక మాధ్యమాల్లో ఉంచుతానని, ఆమె ఇంటి వద్ద అతికిస్తానని బెదిరిస్తున్నాడు. ఒక రోజు ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు పేట్‌ బషీర్‌బాద్‌ షీ టీమ్స్‌ను ఆశ్రయించారు.

నమ్మించి.. మోసగించి..

శంషాబాద్‌కు చెందిన ప్రైవేటు సంస్థలో పనిచేసే సొంటి సందీప్‌(27) అదే సంస్థలో పనిచేసే ఓ యువతిని ప్రేమ, పెళ్లి అంటూ నమ్మించి మోసగించాడు. ఆమె గర్భం దాల్చగా గర్భస్రావం చేయించాడు. తర్వాత వేరే యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. శంషాబాద్‌ షీ టీమ్స్‌కు బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  

నంబరు బ్లాక్‌ చేసినా..

ప్రైవేటు సంస్థలో పనిచేసే ఓ యువతి(22) పెళ్లి సంబంధం ఉంటే చూడాలని తోటి ఉద్యోగితో చెప్పింది. అతడు తన స్నేహితుడు సోమేష్‌(26)కు చెప్పి ఆమె ఫోన్‌ నంబరు ఇచ్చాడు. అతడు ఫోన్‌చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పగా అతడి అలవాట్లు నచ్చక ఆమె నిరాకరించింది. అతడు ఫోన్‌ చేస్తూ, సంక్షిప్త సందేశాలతో వేధిస్తున్నాడు. అతడి నంబరు బ్లాక్‌ చేసినా ఇతరుల ఫోన్‌ తీసుకుని కాల్స్‌ చేస్తున్నాడు. బాధితురాలు మాదాపూర్‌ షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. విచారణలో అతడికి అప్పటికే పెళ్లయిందని, ముగ్గురు పిల్లలున్నట్లు తేలింది.


ఐటీ కోర్‌ టీం సహాయంతో

నిజాంపేట్‌ ప్రాంతంలో.. ఓ బాలిక (17)ను ఓ వ్యక్తి వెంబడిస్తూ ఆమె ఉంటున్న భవనానికి వచ్చాడు. ఆమె లిఫ్టలో ఐదో అంతస్తులోకి వెళ్తుండగా అందులోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి షీ టీమ్స్‌ బృందాలు అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో అతడిని గుర్తించారు. సైబరాబాద్‌ ఐటీ కోర్‌ టీం సహకారంతో అతడి లొకేషన్‌ను తెలుసుకుని పట్టుకున్నారు. ప్రగతి నగర్‌కు చెందిన, ఓ రెస్టారెంట్‌లో పనిచేసే జి.అజయ్‌ (22)గా గుర్తించారు.


ఫేస్‌బుక్‌లో స్నేహం..

ఓ యువతి (20) గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ అంగీకరించి చాటింగ్‌ చేశారు. అతడు ఆమె చరవాణి నంబరు తీసుకుని మాట్లాడటంతో పాటు వీడియో చాటింగ్‌ చేసుకుంటున్నారు. ఆమెను కలిసి ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడ¢ు. తనతో సంబంధం కొనసాగించాలని లేనిపక్షంలో ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.

* మల్కం చెరువు వద్ద ఉదయపు నడకకు వెళ్లిన ఓ మహిళతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె షీ టీమ్స్‌కు ఫిర్యాదుచేయగా మాటు వేసి నిందితుడిని పట్టుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసే బి.రమేష్‌ (31) ఈ చేష్టలకు పాల్పడినట్టు తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని