logo

Hyderabad: సిటీ బస్సులుగా ‘సూపర్‌ లగ్జరీ’లు

కిక్కిరిసిన బస్సుల్లో ఇబ్బంది పడుతూ ప్రయాణిస్తున్న వారికి కాస్త ఊరటనిచ్చేలా టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated : 07 Dec 2022 07:42 IST

600 ఎంపిక.. సొబగులకు రూ.5 లక్షల చొప్పున ఖర్చు

మియాపూర్‌లో కొనసాగుతున్న ఆకృతి మార్చే పనులు

ఈనాడు, హైదరాబాద్‌: కిక్కిరిసిన బస్సుల్లో ఇబ్బంది పడుతూ ప్రయాణిస్తున్న వారికి కాస్త ఊరటనిచ్చేలా టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది 300 ఎలక్ట్రిక్‌ బస్సులు సమకూరేలోపు అదనంగా 700 బస్సుల వరకూ సమకూర్చాలని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కొత్తగా వచ్చిన వాహన చట్టం ప్రకారం 15 ఏళ్లు దాటిన బస్సు తుక్కుగా మారాల్సిందే. 2023 నుంచి 300 సిటీ బస్సులు తుక్కుగా మారనున్నాయి. అందుకే అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్లు పిలిచింది.

ఈ నెలాఖరుకే దాదాపు 50 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అదీగాక సూపర్‌లగ్జరీ బస్సులను సిటీ బస్సులుగా మార్చేందుకూ కసరత్తు మొదలైంది. అలా 600 సూపర్‌లగ్జరీ బస్సులు సమకూరనున్నాయి. ఇంకో 4-5 ఏళ్ల వరకూ వాటిని తిప్పొచ్చు. బాడీ, సీటింగ్‌ను మార్చనున్నారు. ఇప్పటికే 200 బస్సులు గ్రేటర్‌జోన్‌కు చేరుకున్నాయి. వాటి ఇంజిన్లను పరిశీలించి శబరిమల  యాత్రలకు వినియోగిస్తున్నారు. అయ్యప్ప భక్తుల తాకిడి తగ్గిన తర్వాత మియాపూర్‌ గ్యారేజీకి తరలించి మార్పులు చేపడతారు. అందుకు ఒక్కో బస్సుకు రూ.5 లక్షల వరకూ ఖర్చు చేస్తారు. ఇప్పటికే 60 బస్సులను తిప్పుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని