logo

కార్మికుల అవసరాలే మా ప్రాధాన్యం

‘చట్టాలు కార్మికులకు అనుకూలంగానే ఉంటాయి. చాలామందికి అవగాహన లేక  ఇబ్బందులు పడుతున్నారు. వందమంది కార్మికులుంటే ఆ సంస్థలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నాం.

Published : 07 Feb 2023 04:06 IST

‘తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి’తో ఆర్థిక సాయం
కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ శ్యామ్‌సుందర్‌ జాజుతో  ‘ఈనాడు’ ముఖాముఖి
- ఈనాడు, హైదరాబాద్‌

‘చట్టాలు కార్మికులకు అనుకూలంగానే ఉంటాయి. చాలామందికి అవగాహన లేక  ఇబ్బందులు పడుతున్నారు. వందమంది కార్మికులుంటే ఆ సంస్థలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి కార్యాలయంలో కార్మికుల ప్రయోజనాధికారులు ఉండేలా చూస్తున్నాం. ‘తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి’ ఏర్పాటు చేసి అందులో రూ.7తో సభ్యులుగా చేరితే కలిగే ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. కార్మికులకు సందేహాలుంటే 040-27634045 నంబరులో సంప్రదించవచ్చు..labour.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులుంటాయని అంటున్న కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్‌ శ్యామ్‌ సుందర్‌ జాజుతో ‘ఈనాడు’ ముఖాముఖి.  

ప్రశ్న: శుభకార్యాలున్నప్పుడు, ఇతర కుటుంబ అవసరాలకు ఈ పథకం ద్వారా ఏమైనా భరోసా లభిస్తుందా?  

సమాధానం: కార్మికుని కుమార్తె (కుటుంబంలో ఒక్కరికే), మహిళా కార్మికురాలి వివాహ సందర్భంగా రూ.10వేలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూపంలో అందజేస్తారు. సంక్షేమ నిధి సభ్యులుగా మూడేళ్లు ఉండాలి. ప్రసూతి సహాయం కూడా కార్మికురాలికి, కార్మికుని భార్యకు రూ.5వేలు (ఇద్దరు పిల్లలకు మాత్రమే)  అందుతుంది.  కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసుకున్న వారికి రూ.2 వేలు అందజేస్తారు. కార్మికుని నెలవారీ వేతనం రూ.16వేలు మించరాదు.

ప్రశ్న: కార్మికుల పిల్లల చదువులకు అండగా నిలుస్తారా?

సమాధానం: ప్రతిభ ఆధారంగా వారికి ఉపకార వేతనం అందుతుంది. పదో తరగతి, ఐటీఐ విద్యార్థికి రూ.వెయ్యి, పాలిటెక్నిక్‌ విద్యార్థికి రూ.1500 అందజేస్తారు. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, లా, అగ్రికల్చర్‌, హార్టీకల్చర్‌ బీఎస్‌సీ, బీఏఎంఎస్‌, బీడీఎస్‌, డీఎంఎల్‌టీ, ఎంఎల్‌ఐటీ, బీవీఎస్‌సీ, బీఫార్మసీ, బీసీఏ, ఎంసీఏ, బీబీఏ, ఎంబీఏ, డీహెంఎస్‌ చదువుతున్న విద్యార్థులకు రూ.2 వేలు ఏడాదిలో అందజేస్తారు. జనవరి మొదటి వారం నుంచి ఫిబ్రవరి 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.  దివ్యాంగులైన విద్యార్థులకు ప్రత్యేక విద్యా ప్రోత్సాహకం కింద రూ.4 వేలు ఉపకార వేతనం అందజేస్తారు.  

ప్రశ్న: కార్మికులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే సంక్షేమ మండలి ద్వారా అందే సాయం ఎలా?

సమాధానం: క్యాన్సర్‌, కిడ్నీ, బ్రెయిన్‌ ట్యూమర్‌, గుండె జబ్బు, పక్షవాతం, ఎయిడ్స్‌, గర్భసంచి చికిత్స, ట్రామాకేర్‌(ప్రమాదాల్లో గాయాలకు చికిత్స) ఇలా పలు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వారి కుటుంబ సభ్యులకు రూ.20,000 వరకూ ఆర్థిక సాయం అందుతుంది. ఈఎస్‌ఐ పరిధిలో ఉన్న కార్మికులకు, యాజమాన్యం ద్వారా వైద్య సహాయం పొందుతున్న వారికి ఈ పథకం వర్తించదు.

ప్రశ్న: ప్రమాదాలు జరిగినప్పుడు  ఎంత ఆర్థిక సాయం అందుతుంది?

సమాధానం: ఈ పథకం కింద రూ.30 వేలు చెల్లిస్తారు. సహజ మరణం అయితే రూ.10వేలు, అంగవైకల్యం ఏర్పడితే రూ.20 వేలు సహాయం అందుతుంది. అంత్యక్రియలకు రూ. 5వేలు ఇస్తారు. అంగవైకల్యం 25 శాతం ఉంటే రూ.10వేలు, 41 శాతం నుంచి 49 శాతం వరకూ ఉంటే రూ. 15వేలు, 50శాతం పైన ఉంటే రూ.20 వేలు అందజేస్తారు.

ప్రశ్న: కార్మికుల కుటుంబ సంక్షేమానికి ఏం చేస్తున్నారు?

సమాధానం: కార్మికుల కుటుంబ సభ్యుల ఆదాయాన్ని పెంచడానికి కుట్టుపని, ఎంబ్రాయిడరీ ఇలా చేతి వృత్తుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తాం. అలాగే క్రీడాస్ఫూర్తి పెంపొందించడానికి ఏటా క్రీడోత్సవాలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు