logo

TS EAMCET: ఎంసెట్‌ దరఖాస్తుకు తిప్పలు..

ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎంసెట్‌-23కి దరఖాస్తు చేసేందుకు ఇంటర్‌ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

Updated : 05 Apr 2023 09:08 IST

 సాంకేతిక సమస్యలంటున్న అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎంసెట్‌-23కి దరఖాస్తు చేసేందుకు ఇంటర్‌ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రుసుం చెల్లించాక వ్యక్తిగత వివరాలు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. డబ్బులు చెల్లించలేదంటూ వెబ్‌సైట్‌ తెరపై ప్రత్యక్షమవుతోంది. వందలాది మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మూడు, నాలుగు రోజుల నుంచి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేస్తున్నా విఫలమవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఎంసెట్‌ నిర్వహిస్తున్న జేఎన్‌టీయూ సహాయవాణికి ఫోన్‌ చేస్తుండగా... నిత్యం బిజీగా వస్తోందని విద్యార్థులు చెబుతున్నారు.

చెల్లించిన ఫీజు వెనక్కి రాకపోతే..

ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష కోసం జనరల్‌ కేటగిరీ విద్యార్థులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500 రుసుం చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంలోనే రుసుం చెల్లించాల్సిన నిబంధన ఉండడంతో అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఫీజు చెల్లిస్తున్నారు. డెబిట్‌ కార్డు, యూపీఐ, ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా నగదు బదిలీ చేస్తున్నారు. చరవాణికి సందేశం వస్తున్నా.. దరఖాస్తు ప్రక్రియ ముందుకు వెళ్లడం లేదు. పేమెంట్‌ ఐడీ అంటూ నంబర్‌ వచ్చిన తర్వాత కూడా దరఖాస్తు చేసేందుకు వీలుకావడం లేదు. సికింద్రాబాద్‌కు చెందిన ఆరుగురు విద్యార్థినులకు ఇదే సమస్య ఎదురైంది. జేఎన్‌టీయూ అధికారులు ఇది సాంకేతిక సమస్యని చెబుతున్నారు. నెల రోజుల్లో 2.30లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పరీక్షలు పూర్తయ్యాక ఒకేసారి దరఖాస్తు చేస్తుండడంతో పేమెంట్‌ గేట్‌వే సర్వర్‌లో సమస్యలు తలెత్తి ఉండొచ్చని వివరించారు. బ్యాంక్‌ అధికారులను సంప్రదించి ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని