logo

Hyderabad Metro: మెట్రో డీపీఆర్‌లకు రెండు కన్సల్టెన్సీల ఎంపిక.. ఒక్కో సంస్థకు రెండేసి ప్యాకేజీలు

మెట్రో మూడో దశ విస్తరణ మార్గాల సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) రూపొందించేందుకు అర్హులైన రెండు కన్సల్టెన్సీలను హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) ఎంపిక చేసింది.

Updated : 03 Sep 2023 08:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రో మూడో దశ విస్తరణ మార్గాల సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) రూపొందించేందుకు అర్హులైన రెండు కన్సల్టెన్సీలను హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) ఎంపిక చేసింది. సిస్ట్రా, ఆర్వీ అసోసియేట్స్‌ ఎంపికైనట్లు హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐదు సంస్థలు టెండర్లు దాఖలు చేయగా, ఆగస్టు 30న టెండర్‌ కమిటీ పరిశీలన అనంతరం సిస్ట్రా, ఆర్వీ అసోసియేట్స్‌, యూఎంటీఎస్‌, రైట్స్‌ సంస్థలు సాంకేతికత అర్హత సాధించాయి. ఒక్కో ప్యాకేజీలో ఎల్‌1గా నిల్చిన సంస్థను ఎంపిక చేశారు. దీంతో ఒక్కో సంస్థ రెండు ప్యాకేజీలను దక్కించుకుంది. ఈ సంస్థలు రెండు నెలల్లోగా ప్రాథమిక ప్రాజెక్ట్‌ నివేదిక (పీపీఆర్‌)ను అందజేయాలి. ఇందులో ట్రాఫిక్‌ సర్వేలు, ప్రయాణికుల డిమాండ్‌, భవిష్యత్తు అంచనాలు, ప్రత్యామ్నాయాలను సూచించాల్సి ఉంటుంది. డీపీఆర్‌ను మూడు నెలల్లో సమర్పించాలి. మెట్రో రైల్‌ అలైన్‌మెంట్‌ దగ్గర నుంచి స్టేషన్లు, డిపోలు, భూమి మీద ఎక్కడ వెళ్లొచ్చు? ఎలివేటెడ్‌ అవసరం ఎక్కడ ఉంటుంది? రవాణా ఆధారిత అభివృద్ధి వంటి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలి. టెండర్‌ దక్కించుకున్న సంస్థలు వెంటనే క్షేత్రస్థాయిలో సర్వేలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు మెట్రో రైలు ఎండీ వెల్లడించారు.

  • ప్యాకేజీ-1: బీహెచ్‌ఈఎల్‌-ఇస్నాపూర్‌ (13 కి.మీ), ఎల్బీనగర్‌-పెద్ద అంబర్‌పేట (13 కి.మీ.), ఓఆర్‌ఆర్‌ పటాన్‌చెరు- ఓఆర్‌ఆర్‌ నార్సింగి (22 కి.మీ.) కలిపి 48 కి.మీ.లకు డీపీఆర్‌ను సిస్ట్రా ఏజెన్సీ దక్కించుకుంది. రూ.2.55 కోట్లకు బిడ్‌ వేసింది.
  • ప్యాకేజీ-4: జేబీఎస్‌- తూంకుంట (17 కి.మీ.) డబుల్‌ ఎలివేటెడ్‌ మెట్రో, ప్యారడైజ్‌ -కండ్లకోయ (12 కి.మీ.) డబుల్‌ ఎలివేటెడ్‌ మెట్రో, ఓఆర్‌ఆర్‌ మేడ్చల్‌- ఓఆర్‌ఆర్‌ పటాన్‌చెరు (29 కి.మీ.) మొత్తం 58 కి.మీ.మార్గం డీపీఆర్‌ను సిస్ట్రా దక్కించుకుంది. రూ.2.56 కోట్లకు బిడ్‌ వేసింది.
  • ప్యాకేజీ-2: శంషాబాద్‌ కూడలి- షాద్‌నగర్‌ (28 కి.మీ.), శంషాబాద్‌ విమానాశ్రయం- కందుకూరు ఫార్మాసిటీ (26 కి.మీ.), ఓఆర్‌ఆర్‌ శంషాబాద్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ పెద్ద అంబర్‌పేట (40 కి.మీ.) వరకు మొత్తం 94 కి.మీ. డీపీఆర్‌ను ఆర్వీ అసోసియేట్స్‌ దక్కించుకుంది. రూ.3.05 కోట్లకు బిడ్‌ దాఖలు చేసింది.
  • ప్యాకేజీ-3: ఉప్పల్‌ కూడలి- బీబీనగర్‌ (25 కి.మీ.), తార్నాక చౌరస్తా- ఈసీఐఎల్‌ చౌరస్తా (8కి.మీ.), ఓఆర్‌ఆర్‌ పెద్ద అంబర్‌పేట నుంచి ఓఆర్‌ఆర్‌ మేడ్చల్‌   (45 కి.మీ.) మొత్తం 78 కి.మీ. దూరానికి రూ.2.53 కోట్లతో బిడ్‌ వేసి ఆర్వీ అసోసియేట్స్‌ దక్కించుకుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని