logo

Hyderabad: అరవై గజాల ప్లాటు.. అంతస్తుకో రేటు

నగరంలో అక్రమ నిర్మాణాలు అడ్డులేకుండా సాగుతున్నాయి. అనుమతి లేకుండా వందల భవనాలు వెలుస్తున్నాయి. బస్తీలు, కాలనీల్లో 60-100గజాల విస్తీర్ణంలో ఐదారంతస్తుల నిర్మాణాలొస్తున్నాయి.

Updated : 13 Dec 2023 08:37 IST

అనుమతి లేకుండా ఐదారంతస్తుల భవనాల నిర్మాణం
తనిఖీలను అటకెక్కించిన జీహెచ్‌ఎంసీ

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో అక్రమ నిర్మాణాలు అడ్డులేకుండా సాగుతున్నాయి. అనుమతి లేకుండా వందల భవనాలు వెలుస్తున్నాయి. బస్తీలు, కాలనీల్లో 60-100గజాల విస్తీర్ణంలో ఐదారంతస్తుల నిర్మాణాలొస్తున్నాయి. చిన్న చిన్న స్థలాల్లో అపార్ట్‌మెంట్లు కడుతున్నారు. ఇంత జరుగుతున్నా.. జీహెచ్‌ఎంసీ నిద్రమత్తు వీడట్లేదు.  టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు వసూళ్లకు అడ్డాగా మారాయన్న ఆరోపణలున్నాయి. ఒక్కో అంతస్తుకు రూ.1లక్ష.. భారీ భవనాలైతే అంతకుమించి వసూలు చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.

కనిపించని అధికారులు..

నగరంలో ఆరు జోన్లు, వాటి కింద 30 సర్కిళ్లు, వాటి పరిధిలో 150 డివిజన్లున్నాయి. అకమ్ర కట్టడాల కట్టడికి ఒక్కో డివిజన్‌కు ఒక న్యాక్‌ ఇంజినీరును నియమించారు. సిబ్బంది కొరత ఉండటంతో పాతబస్తీలో రెండు డివిజన్లకు ఓ ఇంజినీరును కేటాయించారు. డివిజన్లో తిరుగుతూ పునాది దశలోనే అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలి. వారి పనితీరును సర్కిల్‌ అధికారి పర్యవేక్షించాలి. జోన్‌కు రెండు చొప్పున ఉన్నతాధికారులతో ఏర్పాటైన ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు డివిజన్‌ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకొని ఫిర్యాదులను పరిష్కరించాలన్నది లక్ష్యం.

  • ఇళ్ల యజమానులు, నిర్మాణదారులతో కొందరు అధికారులు కుమ్మక్కవుతున్నారు. ఎవరైనా అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేస్తే.. వారి ఫోన్‌ నెంబర్లకు అక్రమ నిర్మాణం చేపట్టిన యజమానికి ఇస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి.

అడుగడుగునా నిబంధనలకు పాతర..

  • శేరిలింగంపల్లి జోన్లోని మాదాపూర్‌, శేరిలింగంపల్లి సర్కిళ్లలో కొందరు అధికారుల రోజువారీ ఆదాయం రూ.4లక్షలకు తక్కువ ఉండట్లేదు. బినామీ పేర్లతో స్టేషనరీ సరఫరా కూడా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఓ అధికారి అయితే.. కంప్యూటర్లు, ప్రింటర్ల కొనుగోళ్లలోనూ రూ.లక్షలు సంపాదించారు. పలు ఎలక్ట్రానిక్‌ వస్తువులను అమీర్‌పేటలోని తన బినామీ సంస్థలో ఏర్పాటు చేసుకున్నారు.
  • విజయనగర్‌కాలనీ ఎన్‌ఎండీసీ రోడ్డుపై ప్రస్తుతం నాలుగు నుంచి ఐదు భారీ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటికి అనుమతి లేకపోవడం గమనార్హం. పైగా.. ఆయా భవనాల నిర్మాణ సామగ్రితో రోడ్డును సగం మేర కబ్జా చేశారు.
  • న్యూ మలక్‌పేటలో 100గజాల స్థలంలో ఇప్పటికే ఆరంతస్తుల భవనం నిర్మాణమైంది. ఇసుక, కంకర, ఇనుప కడ్డీలతో రోడ్డును నింపేశారని స్థానికుల ఫిర్యాదు.
  • మాదాపూర్‌, అయ్యప్పసొసైటీ, గురుకుల సొసైటీ, గోపాల్‌నగర్‌ సొసైటీల పరిధిలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌ నుంచి గోపాల్‌నగర్‌ సొసైటీ వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఆక్రమించిన స్థలాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని