logo

Hyderabad: ఎల్‌ అండ్‌ టీ మెట్రోకు రూ.2 వేల కోట్లపై సందిగ్ధం!

హైదరాబాద్‌లో మెట్రోరైలును నిర్మించి నిర్వహిస్తున్న ఎల్‌ అండ్‌ టీ సంస్థ కొవిడ్‌ నష్టాల నుంచి బయట పడేందుకు రూ.3 వేల కోట్లు వడ్డీ లేని రుణాన్ని అందిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Updated : 09 Feb 2024 08:01 IST

నష్టాల నుంచి బయటపడేందుకు ఇస్తామని గత ప్రభుత్వ హామీ
ఇప్పటివరకు రూ.1000 కోట్లు ఇచ్చారని సంస్థ సీఎఫ్‌వో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మెట్రోరైలును నిర్మించి నిర్వహిస్తున్న ఎల్‌ అండ్‌ టీ సంస్థ కొవిడ్‌ నష్టాల నుంచి బయట పడేందుకు రూ.3 వేల కోట్లు వడ్డీ లేని రుణాన్ని అందిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు ఇవ్వగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగింపు నాటికి రూ.900 కోట్లను సమకూర్చింది. 16 ఏళ్ల వరకు వడ్డీ లేకుండా ఈ రుణాన్ని మంజూరు చేసింది. ఇప్పటివరకు రూ.వెయ్యి కోట్లు ప్రభుత్వం నుంచి అందిందని ఎల్‌ అండ్‌ టీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ అధికారి (సీఎఫ్‌వో) ఆర్‌.శంకరరామన్‌ తెలిపారు. మెట్రోలో ప్రస్తుతం నిత్యం 4.80 లక్షల మంది దాకా ప్రయాణిస్తున్నారు. వార్షిక నిర్వహణకు రూ.2 వేల కోట్లపైనే అవుతోంది. ఇందులో వడ్డీ చెల్లింపులే అధికం. గత ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఆదాయం రూ.700 కోట్ల దాకా వచ్చింది. మెట్రో ఆపరేషన్స్‌ నిర్వహణకు రూ.350 కోట్ల వరకు అవుతోంది. మొత్తంగా ఐదేళ్లలో రూ.5,425 కోట్ల నష్టాలొచ్చినట్లు ఎల్‌ అండ్‌ టీ చూపించింది. ఇందులో కొవిడ్‌ సమయంలో రెండేళ్ల నష్టాలే రూ.3,500 కోట్లుగా ఆర్థిక ఫలితాల్లో చూపింది. ఆదుకోవాలని కోరగా హామీ ఇచ్చిన గత సర్కారు కమిటీని ఏర్పాటు చేసింది. ఆ సిఫార్సులేవీ బయటకు రాలేదు. అయితే రూ.3 వేల కోట్లను 16 ఏళ్లకు వడ్డీలేని రుణాలుగా ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లు ఎల్‌ అండ్‌ టీ సీఎఫ్‌వో తెలిపారు.


భూములు, మాల్స్‌ గంపగుత్తగా..

మెట్రో ప్రాజెక్ట్‌లో రవాణా ఆధారిత అభివృద్ధికి 60 ఏళ్లకు ప్రభుత్వం రాయదుర్గంలో 15 ఎకరాల విలువైన భూమి, హైటెక్‌సిటీ, పంజాగుట్ట, ఎర్రమంజిల్‌, మూసారాంబాగ్‌, రసూల్‌పురా, మియాపూర్‌, నాగోల్‌ తదితర ప్రాంతాల్లో 269 ఎకరాల భూములు కేటాయించింది. వీటిలో నిర్మాణాలు చేపట్టి లీజు, అద్దెకు ఇవ్వడం ద్వారా 45 శాతం ఆదాయం సమకూర్చుకోవాలనేది పీపీపీ ప్రాజెక్టులోని ఒప్పందం. ప్రయాణికుల ఛార్జీల నుంచి 50 శాతం మాత్రమే ఆదాయం సమకూర్చుకునేలా ప్రాజెక్ట్‌ను డిజైన్‌ చేశారు. అయితే ఊహించని విధంగా కొవిడ్‌ రావడంతో మెట్రో మూతపడి భారీ నష్టాలు రావడంతోపాటు మాల్స్‌ నుంచి వచ్చిన ఆదాయం సున్నా. దీంతో ఈ మాల్స్‌ను గంపగుత్తగా సబ్‌ లైసెన్సింగ్‌కు ఇచ్చేందుకు సర్కారు అనుమతిచ్చిందని ఎల్‌ అండ్‌ టీ చెబుతోంది. మాల్స్‌ కట్టని భూములను సైతం సబ్‌లైసెన్స్‌కు అనుమతిచ్చిందంటూ వేర్వేరు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఫలితంగా ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగైందని ఆ సంస్థ చెప్పింది. ఇదేకాకుండా అధిక వడ్డీకి తీసుకున్న రుణాలను చెల్లించి తక్కువ వడ్డీకి రుణాలను తీసుకుంది. ఈ చర్యల ఫలితంగా 2021తో పోలిస్తే పరిస్థితి మెరుగైందని సీఎఫ్‌వో చెబుతున్నారు. మెరుగైన ఆఫర్‌ వస్తే మొత్తం ప్రాజెక్ట్‌ను వేరే ఇన్వెస్టర్‌కు బదలాయించాలనే ప్రణాళికలో ఎల్‌ అంట్‌ టీ ఉంది. వచ్చే ఏడాది ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెబుతోంది. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడంతో ఈ మొత్తం వ్యవహారాలపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని