logo

Hyderabad: సిటీ బస్సుల్లో మెట్రో తరహా సీటింగ్‌

మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు రోజుకు 11లక్షల మంది ప్రయాణిస్తే..

Updated : 15 Feb 2024 07:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు రోజుకు 11లక్షల మంది ప్రయాణిస్తే.. ఇప్పుడు 18-20లక్షల వరకూ పెరిగారు. ఉదయం, సాయంత్రం కార్యాలయాలు, కళాశాలల సమయంలో సిటీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. సోమ, బుధవారం మరింత రద్దీగా మారిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో బస్సు నిండా సీట్లుంటే ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉండడం లేదని ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ భావించింది. కొన్ని సీట్లు తొలగిస్తే మరింత మందికి చోటు దొరికే అవకాశముంటుంది. బస్సు మధ్యలో ఉన్న ఆరు సీట్లు తొలగించి.. అదేస్థానంలో ఇరువైపులా మెట్రో రైలు మాదిరి సీటింగ్‌ వ్యవస్థ ఏర్పాటుచేస్తే మధ్యలో ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉంటుందని ఆర్టీసీ యోచించింది. ప్రయోగాత్మకంగా కొన్ని మార్గాల్లోని బస్సుల సీటింగ్‌ మార్చింది.  

ఇక్కట్లు తగ్గించేందుకు.. సిటీ బస్సుల్లో ప్రస్తుతం 44 సీట్లున్నాయి. 63 మంది ప్రయాణిస్తే 100శాతం ఆక్యుపెన్సీగా ఆర్టీసీ భావిస్తోంది. మహాలక్ష్మి అమలైనప్పటి నుంచి మహిళా ప్రయాణికులు రెండింతలయ్యారు.

  • ఈ పరిస్థితుల్లో బస్సు ఎక్కడం, దిగడం గగనంగా మారుతోంది. కండక్టర్‌ టికెట్లు జారీ చేయడమూ ఇబ్బందిగా మారింది. ఏ ఒక్కరికి జీరో టిక్కెట్‌ జారీ చేయకపోయినా.. వారిపై చర్యలుంటున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం సీటింగ్‌ వ్యవస్థను మార్చడమే అని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

రెండు సీట్లే తగ్గుతాయి

మెట్రో మాదిరి ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటు కల్పిస్తున్నాం. మధ్యలో ఉన్న ఆరు సీట్లు తొలగిస్తే మొత్తం 12 మంది కూర్చొనే అవకాశం కోల్పోతారు. ఆ స్థానంలో బస్సుకు ఇరువైపులా మెట్రో మాదిరి 5 సీట్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నాం. ఇలా 10 సీట్లు సమకూరుతాయి. గతంతో పోలిస్తే రెండు సీట్లు  తగ్గుతాయి. రద్దీ ఎక్కువున్న మార్గాల్లో కొన్ని బస్సులకు సీటింగ్‌ వ్యవస్థ మార్చాం.

వెంకటేశ్వర్లు, ఈడీ, ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని