logo

చిన్నవి చిక్కాయి.. పెద్ద చేప తప్పించుకుంది!

జలమండలిలో తాజాగా జరిగిన అవినీతి నిరోధక శాఖ దాడుల్లో పెద్ద చేప తప్పించుకుందనే చర్చ జరుగుతోంది.

Updated : 17 Mar 2024 05:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: జలమండలిలో తాజాగా జరిగిన అవినీతి నిరోధక శాఖ దాడుల్లో పెద్ద చేప తప్పించుకుందనే చర్చ జరుగుతోంది. శుక్రవారం సీజీఎం రెవెన్యూ విభాగంలో సీనియర్‌ అసిస్టెంట్‌ (ఫైనాన్స్‌) ఎల్‌.రాకేష్‌, మరో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి సందీప్‌ రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడటం తెలిసిందే. తొలుత అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి సందీప్‌ సంబంధిత వ్యక్తి నుంచి డబ్బులు తీసుకొని రాకేష్‌కు అందించారు. ఈ సమయంలోనే ఏసీబీ అధికారులు దాడులు చేసి రాకేష్‌ నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనిలో ఓ పెద్ద చేపకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ట్యాంకర్‌ బిల్లులు చెల్లింపుతోపాటు రెన్యువల్‌ చేయాలంటే ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ సాయిలో తీసుకునే నిర్ణయం కాదని, దీని వెనుక వేరే అదృశ్య హస్తం ఉన్నట్లు చెబుతున్నారు. పెద్ద చేప చెప్పినట్లు చేసి చిన్న చేపలు ఏసీబీ వలలో చిక్కుకున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి రూ.1.7 లక్షల లంచం డిమాండ్‌ చేసినట్లు చెబుతున్నారు. రూ.లక్ష అడ్వాన్సు కింద చెల్లిస్తుండగా.. ఏసీబీ వలపన్ని పట్టుకుంది. ప్రతి పనికి వసూలు చేస్తుంటారనే పేరు పెద్ద చేపకు ఉంది. జలమండలి 650 పైగా అద్దె ట్యాంకర్లను తీసుకొని నడిపిస్తోంది. ఏటా అద్దెను రెన్యువల్‌ చేయాలి. రెన్యువల్‌తోపాటు అద్దెలు చెల్లింపులో కొందరు కింది స్థాయి నుంచి ఆపై అధికారులకు ముడుపులు చెల్లించుకోవాలి.

ఓపీటీలు తెలుసుకొని

గృహ అవసరాలకు అని చెప్పి కొందరు ట్యాంకర్‌ యజమానులు వాణిజ్య అవసరాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో కొంత మొత్తం నిర్వాహకులకు జలమండలి కమీషన్‌ కింద చెల్లిస్తుంది. పలువురు ట్యాంకర్ల నిర్వాహకులు డొమెస్టిక్‌ కింద ట్యాంకర్‌ తీసుకొని వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నారు. ట్యాంకర్‌ బుక్‌ చేసిన వెంటనే ఓటీపీ సంబంధిత వినియోగదారుడికి పోతుంది. ఓటీపీ చెప్పిన తర్వాతే ట్యాంకర్‌ను సరఫరా చేస్తారు. కొందరు ట్యాంకర్‌ నిర్వాహకులు తమకు తెలిసిన 20-30 మంది వినియోగదారుల సెల్‌నెంబర్లను ముందే సేకరించి పెట్టుకుంటున్నారు. వీరికి అవసరమైనప్పుడు ట్యాంకర్‌ అందిస్తామని ముందే ఒప్పందం చేసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని