logo

Hyderabad: ఆ అడ్డాలో నిలిచేదెవరు బిడ్డా..?

రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాలది ఒకదారైతే.. హైదరాబాద్‌ది  మరో దారిలా ఉంది. మిగిలిన ఎంపీ స్థానాల్లో పోటీకి కాంగ్రెస్‌, భారాసల్లో అనేక మంది పోటీపడుతుంటే.. హైదరాబాద్‌ స్థానంలో నిలిచేందుకు రెండు పార్టీల్లోనూ ఒక్కరూ ముందుకు రావడంలేదు.

Updated : 24 Mar 2024 09:18 IST

‘హైదరాబాద్‌’ నుంచి పోటీకి ముందుకురాని నేతలు
అభ్యర్థిని నిలిపేందుకు రెండు ప్రధాన పార్టీల అన్వేషణ
ఈనాడు, సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాలది ఒకదారైతే.. హైదరాబాద్‌ది  మరో దారిలా ఉంది. మిగిలిన ఎంపీ స్థానాల్లో పోటీకి కాంగ్రెస్‌, భారాసల్లో అనేక మంది పోటీపడుతుంటే.. హైదరాబాద్‌ స్థానంలో నిలిచేందుకు రెండు పార్టీల్లోనూ ఒక్కరూ ముందుకు రావడంలేదు. దీంతో రెండు పార్టీల అగ్రనేతలు ఇక్కడ అభ్యర్థి కోసం అన్వేషించాల్సి వస్తోంది. అందుకే మూడు స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినా హైదరాబాద్‌కు మాత్రం ఎవరినీ ప్రకటించలేకపోయాయి.

ఎంఐఎంతో రెండు పార్టీల దోస్తీ..!

తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఎంఐఎంతో భారాస స్నేహంగా ఉంటోంది. దీంతో ఇక్కడ ఆ పార్టీ తమ అభ్యర్థిని నామమాత్రంగానే పోటీకి పెడుతూ వచ్చింది. కాంగ్రెస్‌ నుంచి అభ్యర్థిని నిలిపినా పెద్దగా బలాన్ని ప్రదర్శించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం.. మారిన పరిణామాల నేపథ్యంలో హస్తం పార్టీతో ఎంఐఎం స్నేహపూర్వకంగా ముందుకు వెళుతోంది. ఈ క్రమంలో ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి నామమాత్రంగా ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. భారాసలోనూ ఇదే విధమైన పరిస్థితి ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఎవరో ఒక నేతను అభ్యర్థిగా ప్రకటించడానికి పార్టీ కసరత్తు చేస్తోంది. భాజపా మాత్రం హైదరాబాద్‌ అభ్యర్థిగా మాధవీలతను ప్రకటించింది.

మైనార్టీల ఇలాకా..

గ్రేటర్‌ పరిధిలోని సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్‌, భారాసలు అధికారికంగా ప్రకటించాయి. కానీ ఇంతవరకు హైదరాబాద్‌ స్థానానికి అభ్యర్థి ఎంపికపై సమీక్ష కూడా చేయలేదు. ఇక్కడ పోటీ చేయడానికి రెండు పార్టీల నుంచి ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీనికి అనేక కారణాలున్నాయి. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహదూర్‌పుర, మలక్‌పేట, కార్వాన్‌ శాసనసభ నియోజకవర్గాల్లో అధికంగా మైనార్టీ ఓటర్లు ఉంటారు. దీనికి తగ్గట్టే కొన్నేళ్లుగా ఇక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. 1984 నుంచి ఎంఐఎం నేత సుల్తాన్‌ సలాఉద్దీన్‌ ఒవైసీ గెలువగా.. తరువాత ఆయన కుమారుడు అసదుద్దీన్‌ ఒవైసీ విజయం సాధిస్తూ వస్తున్నారు. దీంతో ఇతర పార్టీల అభ్యర్థులు నామమాత్రంగానే మిగిలిపోతున్నారు. ఈ పరిణామాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే ఈసారి కూడా ఎంఐఎం ఆధిక్యం ప్రదర్శిస్తుందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని