logo

అన్నదాతకు.. అందని ‘సహకారం’

జిల్లాలోని వివిధ సహకార సంఘాల్లో రైతులు రుణాలకు ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. బ్యాంకుల విలీనంతో అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లు ఎస్‌బీహెచ్‌ సౌజన్యంతో సంఘాలు

Updated : 08 Dec 2021 06:34 IST

ఏడాదిగా నిలిచిన రుణ పంపిణీ

న్యూస్‌టుడే, పెద్దేముల్‌: జిల్లాలోని వివిధ సహకార సంఘాల్లో రైతులు రుణాలకు ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. బ్యాంకుల విలీనంతో అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లు ఎస్‌బీహెచ్‌ సౌజన్యంతో సంఘాలు కొనసాగాయి. ప్రస్తుతం ఎస్బీఐలో విలీనం కావడంతో అన్నదాతలకు అవస్థలు మొదలయ్యాయి. రుణ ప్రణాళిక రూపొందించినా ఆమోదం లభించని పరిస్థితి. దీంతో పలు సంఘాలు ఖరీఫ్‌, రబీకి రుణాలు ఇవ్వడంలేదు. కేవలం పునరుద్ధరించి అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. దీంతో సంఘం నుంచి బయటికి వచ్చి వాణిజ్య బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. సహకార సంఘాల్లో సభ్యత్వం వదులుకుని చాలా మంది ఇతర బ్యాంకుల్లో రుణం తీసుకుంటున్నారు.

జిల్లాలో కొత్తగడి, ఎక్ మామిడి, పూడూరు, హరిదాన్ పల్లి ప్రాథమిక సహకార సంఘాలు, పెద్దేముల్‌ రైతు సేవా సహకార సంఘం సుమారు 40 ఏళ్లగా స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కొనసాగాయి. బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా లావాదేవీలు జరిగేవి. ఏటా రుణ ప్రణాళిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపించే వారు. దానికి తగ్గట్టుగా బడ్జెట్‌ కేటాయించి రుణాలు ఇచ్చే వారు. బ్యాంకుల విలీనంతో పరిస్థితి మారింది. ఎస్‌బీఐ అధికారులు రుణాలు ఇవ్వడం నిలిపివేశారు. నిధుల కోసం సహకార సంఘాలు ఏడాదిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటి వరకు చిల్లిగవ్వ విదల్చలేదు. కొత్తగడి సోసైటీలో 850 మంది రైతులకు రూ.7 కోట్లు, ఎక్ మామిడిలో 686 మందికి రూ.4.5 కోట్లు, హరిదాన్ పల్లిలో 530 మందికి రూ.3 కోట్లు, పెద్దేముల్‌లో 2800 మందికి రూ.3 కోట్ల చొప్పున రుణాలు ఇచ్చేందుకు అప్పుల కోసం బ్యాంకులకు ప్రతిపాదనలు పంపించారు. మొత్తం 4,866 మంది రైతులకు రూ.14.5 కోట్ల నిధులు మంజూరు కావాల్సి ఉంది.

డీసీసీబీలో కలుపాలని తీర్మానాలు: చాలా మంది రైతులు అప్పులు చెల్లించి ఇతర బ్యాంకుల వైపు మొగ్గు చూపుతున్నారు. రైతులతో కళకళలాడాల్సిన సహకార సంఘాల భవనాలు వెలవెలబోతున్నాయి. కొన్ని చోట్ల సిబ్బంది జీతాలు చెల్లించలేని స్థితి నెలకొంది. వడ్డీలు కట్టుకుని ఖాతాలను రెన్యూవల్‌ చేస్తున్నారు. రుణమాఫీకి చాలా మంది అన్నదాతలు ఎదురు చూడాల్సి వస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు అనువుగా లేకపోవడంతో ప్రాథమిక సహకార సంఘాలు, పెద్దేముల్‌ రైతు సహకార సంఘం డీసీసీబీలో విలీనం చేయాలని తీర్మానాలు చేశారు.

సిబ్బందికి జీతాలు ఇవ్వలేక..: పెద్దేముల్‌ రైతు సేవా సహకార సంఘం 1977లో ఏర్పాటు చేశారు. 22 గ్రామాలకు చెందిన 6 వేలకు పైగా రైతులు సభ్యత్వం పొందారు. అన్నదాతలకు అన్ని రకాల రుణాలను అందజేశారు. ఎరువులు, విత్తనాలను రాయితీపై పంపిణీ చేశారు. చేనేత, ఫౌల్ట్రీ రంగాన్ని ప్రోత్సహించారు. ఇలా 25 ఏళ్ల పాటు వివిధ రకాల తోడ్పాటును అందిస్తూ కళకళలాడింది. లాభాలు రావడంతో సొంత భవనాన్ని సమకూర్చుకున్నారు. ప్రస్తుతం సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.  రైతుల రాకపోకలు లేక వెలవెలబోతోంది.

బ్యాంకు నుంచి సరైన స్పందన లేదు: విష్ణువర్ధన్‌రెడ్డి, ఛైర్మన్‌, పెద్దేముల్‌ సొసైటీ
సంఘం సమావేశాల్లో, సర్వసభ్య సమావేశాల్లో రుణాల కోసం తీర్మానాలు చేశాం. బ్యాంకుల విలీనంతో మేనేజింగ్ డైరెక్టర్ ను తొలగించారు. రూ.3 కోట్ల రుణానికి ప్రతిపాదనలు  పంపించినా స్పందన లేదు. డీసీసీబీలో విలీనం చేయాలని తీర్మానం చేశాం. చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. రుణాలు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. తక్షణం బ్యాంకు అధికారులు స్పందించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని