Somerton Man: ఓ వ్యక్తి మరణం.. 73 ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ..!

ఆస్ట్రేలియాలో (Australia) ఏడు దశాబ్దాల క్రితం చోటుచేసుకున్న ఓ మరణం ఆ దేశ చరిత్రలోనే ఓ మిస్టరీ (Mysterious Death) కేసుగా మిగిలిపోయింది.

Published : 28 Jul 2022 23:46 IST

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో (Australia) ఏడు దశాబ్దాల క్రితం చోటుచేసుకున్న ఓ మరణం ఆ దేశ చరిత్రలోనే ఓ మిస్టరీ (Mysterious Death) కేసుగా మిగిలిపోయింది. చనిపోయిన వ్యక్తి ఎవరు..? ఎక్కడ నుంచి వచ్చారు..? ఎలా చనిపోయారనే విషయాన్ని కనుక్కునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. భగ్న ప్రేమికుడి నుంచి గూఢచారి వరకు అనేక కోణాల్లో ఆయన చుట్టూ ఎన్నో కథనాలు, అనుమానాలు, దర్యాప్తులు జరిపినప్పటికీ చివరకు ఆయన ఎవరనే విషయాన్ని తేల్చలేకపోయారు. దీంతో ఏడు దశాబ్దాలుగా ఆ వ్యక్తి మరణం ఓ మిస్టరీగానే (Mystery) మారింది. కానీ, పట్టువిడువని విక్రమార్కుడిలా ఓ పరిశోధకుడు కొన్నేళ్లపాటు చేసిన కృషితో ఎట్టకేలకు ఆయన ఎవరనే విషయం తేలింది.

హత్య కాదు.. మరేంటి..?

ఆస్ట్రేలియాలోని సోమెర్టన్‌ బీచ్‌.. డిసెంబర్‌ 1, 1948 సంవత్సరం. బీచ్‌లో అచేతనంగా పడివున్న ఓ 40ఏళ్ళ వ్యక్తి దగ్గర సందర్శకులు గుమికూడారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. సూటు, బూటు వేసుకొని నీట్‌గా ఉన్న ఆ వ్యక్తి మరణించినట్లు గుర్తించారు. కానీ, ఆయన పేరు, చిరునామాకు సంబంధించిన ఆనవాళ్లేమీ లేవు. ఆ వ్యక్తి సంబంధీకులు కూడా ఎవ్వరూ రాలేదు. ఆయన శరీరంపై ఎటువంటి గాయాలు కూడా లేవు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు.. విషప్రయోగం వల్ల గుండెపోటుతో మరణించవచ్చనే అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ కారణాలు మాత్రం కచ్చితంగా చెప్పలేకపోయారు.

రష్యా గూఢచారి..?

సోమర్టెన్‌ మ్యాన్‌గా (Somerton man) పేర్కొన్న ఆయన పాకెట్‌లో ఉపయోగించని బస్సు, రైలు టికెట్లతోపాటు చూయింగ్‌ గమ్‌, రెండు దువ్వెనలు, అగ్గిపుల్లలతో పాటు ఓ సిగరెట్‌ డబ్బా లభించాయి. కానీ, ఆయన వ్యక్తిగత సమాచారానికి సంబంధించి ఎటువంటి ఐడీ కార్డులు, ధ్రువీకరణ పత్రాలు లభించలేదు. ఆయన చొక్కా కాలర్‌, సూట్‌కేసుపైనా పేర్లు కూడా లేవు. దీంతో ఆయన రష్యా లేదా ఇతర దేశాలకు చెందిన గూఢచారి కావచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, పార్సీ భాష పద్యంలోని చివరి పదాలతో (Tamam Shud అంటే It's Finished అనే అర్థం) కూడిన ఓ పేపర్‌ ముక్క ఆయన జేబులో లభించడంతో ఆ దిశగా పరిశోధన చేపట్టారు. అదే సమయంలో అడిలైడ్‌ రైల్వే స్టేషన్‌లో ఓ సూట్‌కేసు దొరకగా అందులో పురుషుడి దుస్తులతోపాటు ఇతర వస్తువులు లభించాయి. అవి నవంబర్‌ 30న రైల్వేస్టేషన్‌లో వదిలిపెట్టినట్లు గుర్తించిన పోలీసులు.. అవి సోమర్టెన్‌ బీచ్‌లో మరణించిన వ్యక్తివే అని అనుమానించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినప్పటికీ ఆయన ఎవరు, మరణానికి గల కారణాలు ఏంటనే విషయాలు మాత్రం అంతుచిక్కలేదు. దీంతో ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న ఆస్ట్రేలియా పోలీసులు ఆయన ఫింగర్‌ఫ్రింట్స్‌ను ప్రపంచ వ్యాప్తంగా పంపించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.

ఎన్నో కథలు, కథనాలు..

సోమర్టెన్‌ బీచ్‌లో గుర్తించిన వ్యక్తికి సంబంధించి మిస్సింగ్‌ కేసు కూడా దేశంలో ఎక్కడా నమోదు కాకపోవడం కేసు దర్యాప్తును ముందడుగు పడలేదు. ఇక చేసేదేమి లేక పదిహేను రోజుల తర్వాత (1949లో) ఓ శ్మశానవాటికలో సోమర్టెన్‌ మ్యాన్‌ మృతదేహాన్ని అధికారులు పూడ్చిపెట్టారు. ‘ఇక్కడున్నది ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం. స్టోమర్టన్‌ బీచ్‌లో లభించింది’ అని అక్కడున్న రాతిపై అధికారులు రాసిపెట్టారు. ముందుజాగ్రత్తగా ఆయనకు సంబంధించిన వస్తువులను అధికారులు భద్రపరిచారు. తర్వాత జరిపిన పరిశోధనల్లోనూ ఆయన ఎవరనే విషయం తెలియకపోవడంతో పోలీసులు ఆ కేసును పక్కకుపెట్టారు. అనంతరం ఈ మిస్టరీ కేసుపై ఎన్నో కథనాలు, డాక్యుమెంటరీలు, పుస్తకాలు కూడా వచ్చాయి.

డీఎన్‌ఏ విశ్లేషణతో..

ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న యూనివర్సిటీ ఆఫ్‌ అడిలైడ్‌కు చెందిన ప్రొఫెసర్‌ డెరెక్‌ అబోట్‌.. కొన్నేళ్లపాటు పరిశోధన చేపట్టారు. గతంలో మృతుడి నుంచి సేకరించి భద్రపరిచిన వెంట్రుకల డీఎన్‌ఏ సహాయంతో పరిశోధన మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా అమెరికాలోని ప్రముఖ ఫోరెన్సిక్‌ నిపుణుడు కొల్లీన్‌ ఫిట్స్‌పాట్రిక్‌ను సంప్రదించారు. డీఎన్‌ఏ విశ్లేషణలో ఎంతో నైపుణ్యమున్న ఆమె గతంతో ఎన్నో మిస్టరీ కేసులను ఛేదించారు. ఇలా ఇద్దరు నిపుణులు కలిసి డీఎన్‌ఏ డేటాబేస్‌లోని నమూనాలతో పోల్చుకుంటూ వెళ్లారు. ఇలా కుటుంబ వృక్షాన్ని నిర్మిస్తూ వెళ్లిన పరిశోధకులకు చివరగా సోమర్టెన్‌ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తితో ఆ నమూనాలు సరిపోలడంతో ఊపిరి పీల్చుకున్నారు.

వీడిన మిస్టరీ..

డీఎన్‌ఏ విశ్లేషణలో ద్వారా చివరకు ఆ వ్యక్తి ఆస్ట్రేలియాకు చెందిన కార్ల్‌ వెబ్‌ (Carl Webb) అనే భావనకు వచ్చారు. మెల్‌బోర్న్‌ శివారులోని ఫూట్‌స్క్రేలో నవంబర్‌ 16, 1905న ఆయన జన్మించినట్లు పేర్కొన్న పరిశోధకులు.. ఆయన ఓ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా గుర్తించారు. ఆయనకు ఆరుగురు తోబుట్టువులు ఉండగా అందులో కార్ల్‌వెబ్‌ చిన్నవాడని పరిశోధకులు నిర్ధారించారు. ఇదే సమయంలో మెల్‌బోర్న్‌కు చెందిన వ్యక్తి అడిలైడ్‌ (Adelaide)కు ఎందుకు వచ్చారనే దానికి ఆధారాలు ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. భార్యతో విడిపోయిన ఆయన.. కొంతకాలం తర్వాత ఆమెను వెతుక్కుంటూ అడిలైడ్‌ వచ్చినట్లు భావిస్తున్నామని అన్నారు.

ఇలా ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యంత మిస్టరీ మరణంగా భావిస్తోన్న ఈ కేసును ఛేదించడం ఎంతో సంతోషంగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. అయితే, ఆయన ఎలా, ఎందుకు మరణించారనే కారణాలు తెలియడానికి మరికొన్ని సంవత్సరాలు పట్టవచ్చని అంచనా వేశారు. దీనిపై పోలీసులు అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ.. కేసు దర్యాప్తును కొనసాగించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని