Anasuya: అస్తమానం నన్నెందుకు లాగుతారు.. నేను మీకు ఆంటీని కాదు : అనసూయ

Anasuya: తనని ఆంటీ అంటూ వ్యాఖ్యానించిన నెటిజన్‌కు అనసూయ తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు.

Published : 05 Apr 2024 00:03 IST

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల వేదికగా చురుగ్గా ఉంటారు నటి అనసూయ (Anasuya Bharadwaj). తన సినిమాలతో పాటు, కుటుంబానికి సంబంధించిన విషయాలు, ఫొటోలను పంచుకుంటూ ఉంటారు. ఇక తన పేరును ప్రస్తావిస్తూ కామెంట్స్‌ చేసే నెటిజన్లకు తనదైన శైలిలో సమాధానం ఇస్తుంటారు. విజయ్‌ దేవరకొండను కోట్‌ చేస్తూ ఓ నెటిజన్‌ చేసిన కామెంట్‌లో అనసూయ పేరును ఉదహరించాడు. ఆ వ్యాఖ్యపై అనసూయ అసహనం వ్యక్తంచేశారు.

‘‘ఎందుకు కార్తీక్‌ గారు అస్తమానం నన్ను లాగుతుంటారు. ఎవరు ఏం మాఫియా చేస్తున్నారో నేను ఎప్పుడో చెప్పి వదిలేశాను. అనవసరంగా నేనే హైప్‌ ఇస్తున్నానని నిజమేనేమోనని వదిలేశాను. నేను కూడా తెలంగాణ బిడ్డనే. కానీ, నాకు సింపథీ అక్కర్లేదు. నాకు నా మీద నమ్మకం.. దేవుడి మీద నమ్మకం.. మా అమ్మానాన్నలు నాకిచ్చిన విలువలు.. పెంపకం.. నన్ను నా దృష్టిలో ఎప్పుడూ దిగజారనివ్వవు. ఇప్పుడు ఈ ట్వీట్‌ని కూడా తమ స్వార్థానికి వాడుకున్నా నేనేమీ ఆశ్చర్యపోను. కానీ, నాకు వాళ్లకూ ఎటువంటి సంబంధం లేదు. అన్నట్లు నాకు తెలిసి మీరు, నేనూ చుట్టాలం అస్సలు కాదు. నేను మీకు ఆంటీ కానేమో. అయినా మీ ఇంట్లో ఒకసారి అడగండి. మీకు తెలియకుండా రిలేషన్స్‌ ఉన్నాయేమో. ఎందుకంటే చుట్టాలైతేనే ఆ పలకరింపులు ఉంటాయని నాకు నా పెద్ద వాళ్లు నేర్పించారు. ఏదేమైనా మీకు అంతా మంచి జరగాలి’’ అంటూ సమాధానం ఇచ్చారు.

ఇటీవల ‘రజకార్‌’ మూవీలో పోచమ్మగా నటించి మెప్పించిన అనసూయ.. ‘పుష్ప2’లో (Pushpa 2: The Rule) దాక్షాయణిగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ తొలి భాగంలో కేవలం కొన్ని సీన్లకే పరిమితమైన ఆమె రెండో భాగంలో మరింత కీలకం కానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని