Parthudu Review: పార్థుడు రివ్యూ.. ప్రకాశ్‌ రాజ్‌ నటించిన పొలిటికల్‌ డ్రామా ఎలా ఉందంటే?

తెలుగు ఓటీటీ ‘ఈటీవీ విన్‌’లో ‘పార్థుడు: పొలిటికల్‌ గేమ్స్‌’ సినిమా శుక్రవారం విడుదలైంది. ప్రకాశ్‌ రాజ్‌, అనూప్‌ మేనన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే?

Updated : 25 Aug 2023 18:34 IST

Parthudu Review; చిత్రం: పార్థుడు: పొలిటికల్‌ గేమ్స్‌; తారాగణం: ప్రకాశ్‌ రాజ్‌, అనూప్‌ మేనన్‌, సన్నీ వేన్‌, సురేశ్‌ కృష్ణ, శంకర్‌ రామకృష్ణన్‌ తదితరులు; సంగీతం: గోపీ సుందర్‌; కూర్పు: అయూబ్‌ఖాన్‌; ఛాయాగ్రహణం: రవి చంద్రన్‌; నిర్మాత: పీఏ సెబాస్టియన్‌; దర్శకత్వం: కన్నన్‌ తామరైకులం; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: ఈటీవీ విన్‌.

ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj), అనూప్‌ మేనన్‌ (Anoop Menon) ప్రధాన పాత్రల్లో దర్శకుడు కన్నన్‌ తెరకెక్కించిన చిత్రం ‘వరాల్‌’ (Varaal). మలయాళంలో మెప్పించిన ఈ సినిమాని ‘పార్థుడు: పొలిటికల్‌ గేమ్స్‌’ (Parthudu) పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win). శుక్రవారం నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా కథేంటి? ఎలా ఉందంటే? (Parthudu Review)..

ఇదీ కథ: అచ్యుతన్‌ నాయర్ (ప్రకాశ్‌ రాజ్‌) కేరళ ముఖ్యమంత్రి. సీఎంగా వరుసగా రెండు సార్లు ప్రజలకు సేవ చేసిన ఆయన.. తదుపరి ఎన్నికల కోసం సిద్ధమవుతుంటారు. మరోసారి తానే ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తారు. కానీ, యువ రక్తానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ హైకమాండ్‌ డేవిడ్‌ జాన్‌ (అనూప్‌ మేనన్‌)ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుంది. వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన డేవిడ్‌పై అంతటా వ్యతిరేకత వస్తుంది. ఈ క్రమంలోనే ఆయన కిడ్నాప్‌నకు గురి అవుతాడు. మరి, డేవిడ్‌ను కిడ్నాప్‌ చేసింది ఎవరు? ఆయన అపహరణకు రాజకీయ వివాదాలు కారణామా? లేదా వ్యక్తిగత గొడవలా? ముఖ్యమంత్రిగా ఎవరు పదవిని చేపట్టారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే (Parthudu Review).

ఈటీవీ విన్‌ బంపర్‌ ఆఫర్‌

ఎలా ఉందంటే: రాజకీయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి, ఆ రంగంపై అవగాహనలేని వ్యక్తికి మధ్య సాగే ఆటే ఈ సినిమా కథాంశం. కేరళ, దిల్లీ ప్రాంతాల చుట్టూ కథ తిరుగుతుంది. సమకాలీన రాజకీయాలను కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ప్రారంభ సన్నివేశాలు నెమ్మదిగా సాగినా, కథలోకి వెళ్లేకొద్దీ ఆసక్తి కలుగుతుంది. అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఓ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించే సన్నివేశంతో సినిమా ప్రారంభమవుతుంది. అక్కడేం జరిగిందన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే దర్శకుడు రాజకీయ ప్రస్తావనను తెరపైకి తీసుకొచ్చారు. రాబోయే ఎన్నికలకు రెండు ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచించుకోవడం, పాత్రల పరిచయానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు దర్శకుడు. డేవిడ్‌ జాన్‌ గురించి ఇతర పాత్రలు ఇచ్చిన ఎలివేషన్‌ బాగున్నా ఆయన ఎంట్రీ ఆ స్థాయిలో లేదు. డేవిడ్‌ ఏ బిజినెస్‌ చేసేవాడు? సీఎం అభ్యర్థిగా నిలిచేంతగా ఎలా ఎదిగాడు? తదితర విషయాలను ప్రస్తావిస్తే బాగుండేది. కానీ, వాటి గురించి చెప్పకుండా ప్లేబాయ్‌గానే ఎక్కువగా చూపించారు (Parthudu Review). అచ్యుతన్‌ నాయర్‌ క్యారెక్టర్‌ను హైలైట్‌ చేయకుండా డేవిడ్‌ పాత్రపైనే కథనాన్ని నడిపించారు.

రివ్యూ: బెదురులంక 2012.. కార్తికేయ కొత్త మూవీ మెప్పించిందా?

డేవిడ్‌ కిడ్నాప్‌ అయినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. అప్పటి వరకు జరిగిన పరిణామాల ప్రకారం అచ్యుతన్‌ నాయరో, డేవిడ్‌ భార్యో కిడ్నాప్‌ చేయించి ఉంటారని ప్రేక్షకుడు భావిస్తాడు. కానీ, ఊహించని మలుపు ఎదురవుతుంది. ఆ కిడ్నాప్‌ చేసిన వ్యక్తి ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో రివీల్‌ చేసే క్రమంలో మరో ట్విస్ట్‌ థ్రిల్‌ పంచుతుంది. కొందరు టెర్రరిస్టులుగా ఎందుకు మారాల్సి వస్తుంది? స్వార్థ రాజకీయాల కారణంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? తదితర అంశాలను కిడ్నాప్‌ సన్నివేశానికి ముడిపెట్టిన విధానం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. ముగింపు సన్నివేశం సంతృప్తికరంగానే ఉంటుంది.

ఎవరెలా చేశారంటే: ప్రకాశ్‌ రాజ్‌ మినహా మిగిలిన వారంతా తెలుగు ప్రేక్షకులకు కొత్తే. పాత్ర నిడివి తక్కువే అయినా అచ్యుతన్‌ నాయర్‌గా ప్రకాశ్‌ రాజ్‌ ఆకట్టుకుంటారు. డేవిడ్‌గా అనూప్‌ మేనన్‌ ఫర్వాలేదనిపిస్తారు. ఇతరులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. గోపీ సుందర్ నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలాన్ని చేకూర్చింది. విజువల్స్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. కన్నన్‌ టేకింగ్‌ బాగుంది (Parthudu Review).

  • బలాలు
  • + ద్వితీయార్ధం
  • + కిడ్నాప్‌ నేపథ్యంలో ట్విస్ట్‌లు
  • బలహీనతలు
  • - ప్రధమార్ధంలో కొన్ని సన్నివేశాలు
  • - పాత్రల పరిచయంలో స్పష్టత లోపించడం
  • చివరిగా: థ్రిల్‌ పంచే పొలిటికల్‌ గేమ్‌ ఇది (Parthudu Review).
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని