SSMB29: మహేశ్‌-రాజమౌళి మూవీ టెక్నికల్‌ టీమ్‌ రెడీ? ఇక అదొక్కటే ఆలస్యం!

SSMB29: యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో రూపొందనున్న మహేశ్‌, రాజమౌళి సినిమాకు సంబంధించిన టెక్నికల్‌ టీమ్‌ వివరాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Updated : 13 Feb 2024 13:17 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణుల వివరాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.  ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, సినిమాటోగ్రాఫర్‌గా పి.ఎస్‌.వినోద్‌, వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌ వైజర్‌గా ఆర్‌.సి.కమల్ కణ్ణన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా మోహన్‌ బింగి, ఎడిటర్‌గా తమ్మిరాజు రంగంలోకి దిగినట్లు సమాచారం. కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా రాజమౌళి సతీమణి రమా రాజమౌళి పనిచేయనున్నారు.

ఇప్పటికే విజయేంద్రప్రసాద్‌ కథ, స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసి రాజమౌళికి అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌కు సంబంధించిన పనులను చిత్ర బృందం వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే కీలక విభాగాలకు సంబంధించిన నిపుణుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. టీమ్‌కు సంబంధించిన వివరాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను తన టీమ్‌తో కలిసి రాజమౌళి వెల్లడించనున్నారని టాక్‌.

మరోవైపు మహేశ్‌బాబు కూడా ఈ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. తన లుక్‌ను కూడా మార్చుకున్నారు. ఇటీవల తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా దిగిన ఫొటోల్లో మహేశ్‌ క్యాప్‌తో కనిపించారు. గడ్డం కూడా పెంచారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. భారీ బడ్జెట్‌, అత్యున్నత టెక్నాలజీని ఈ సినిమా కోసం వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇక అధికారికంగా ప్రకటించి, షూటింగ్‌ మొదలు పెట్టడమే ఆలస్యం. ఇప్పటికే ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ ఇందులో హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయని ప్రచారం ఊపందుకుంది. చెల్సియా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో రాజమౌళిని ఫాలో అవుతుండడంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లైంది. ఇంతకుముందు బాలీవుడ్‌ హీరోయిన్‌ ఒకరు మహేశ్‌ సరసన నటించే ఛాన్స్‌ ఉందంటూ గాసిప్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇండియన్‌ సినిమా చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని ఇటీవల విజయేంద్రప్రసాద్‌ తెలిపారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నారు. అలాగే భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను అనువదించనున్నారు. దీనికి సంబంధించి అమెరికాకు చెందిన ఓ క్యాస్టింగ్‌ ఏజెన్సీతో రాజమౌళి చర్చలు కూడా జరిపారు. ఇది ఒకే సినిమాగా వస్తుందా? లేక రెండు భాగాలుగా వస్తుందా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇదే విషయమై విజయేంద్రప్రసాద్‌ను ప్రశ్నిస్తే, మరో భాగానికి కొనసాగేలా ముగింపు ఉంటుందని చెప్పడం గమనార్హం. ఇక ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన లొకేషన్లను పరిశీలించిన చిత్ర బృందం అందుకు తగిన అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని