Ranga Marthaanda: సైలెంట్‌గా ఓటీటీలోకి ‘రంగమార్తాండ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

ప్రకాశ్‌రాజ్‌-రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రంగమార్తాండ’ (Ranga Marthaanda) ఓటీటీలోకి వచ్చేసింది.

Published : 07 Apr 2023 09:48 IST

హైదరాబాద్‌: ‘రంగమార్తాండ’ (Ranga Marthaanda).. ఆరేళ్ల  గ్యాప్‌ తర్వాత దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) తెరకెక్కించిన చిత్రమిది. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం.. నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు మరోసారి పరిచయం చేసిందీ చిత్రం. మరాఠీ సినిమా ‘నట సామ్రాట్‌’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. గత నెలలో థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ అందుకున్న ఈ సినిమా.. ఎలాంటి ప్రచారం లేకుండా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నేటి నుంచి ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

కథేంటంటే:

రంగ‌స్థలంపై ఎన్నో పాత్రల‌కి జీవం పోసి ర‌క్తి క‌ట్టించిన న‌టుడు రాఘ‌వ‌రావు (ప్రకాశ్‌రాజ్‌). నాట‌క‌రంగ‌మే ప్రపంచంగా బ‌తికిన ఆయ‌న‌కి రంగ‌మార్తాండ అనే బిరుదుని ప్రదానం చేస్తారు. ఆయ‌న స్నేహితుడు చ‌క్రపాణి (బ్రహ్మానందం) కూడా రంగ‌స్థల న‌టుడే. ఇద్దరూ క‌లిసి దేశ విదేశాల్లో ప్రదర్శన‌ల‌తో ప్రేక్షకుల నీరాజ‌నాలు అందుకున్నవారు. జీవితంలో పరస్పరం క‌ష్టసుఖాల్లో పాలు పంచుకున్న వారు. రంగ‌మార్తాండ బిరుదుతో త‌న‌ని స‌త్కరించిన వేదిక‌పైనే నాట‌క రంగం నుంచి నిష్క్రమించి త‌ను సంపాదించిందంతా వార‌సుల‌కి క‌ట్టబెడ‌తాడు రాఘ‌వరావు. అక్కడి నుంచి ఆయ‌న జీవితంలో కొత్త అంకం మొద‌ల‌వుతుంది. ఆ అంకంలో ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? రంగ‌స్థలంపై పోషించిన ప్రతిపాత్రనీ ర‌క్తి క‌ట్టించిన రాఘ‌వ‌రావుకి నిజ జీవితం ఎలాంటి పాత్రని ఇచ్చింది? మ‌రి జీవిత నాట‌కంలో గెలిచాడా లేదా? అనే ఆసక్తికర అంశాలతో ఇది తెరకెక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని