Vidya Balan: మోహన్‌లాల్‌ అలా చేయడం చూసి ఆశ్చర్యపోయా: విద్యా బాలన్‌

మోహన్‌లాల్‌ని చూసి విలువైన పాఠాలు నేర్చుకున్నట్లు నటి విద్యాబాలన్ చెప్పారు. 

Published : 09 Apr 2024 15:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి విద్యా బాలన్‌ (Vidya Balan) అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌పై (Mohanlal) ప్రశంసలు కురిపించారు. ‘చక్రం’ అనే మలయాళం సినిమాలో ఆయనతో కలిసి నటించిన విద్యా ఆ సమయంలో ఆయన్ని చూసి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నట్లు చెప్పారు. అవి తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు.

‘‘ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తి. ‘చక్రం’ సినిమా సెట్‌లో ఆయన చేసిన పనులకు నేను ఆశ్చర్యపోయాను. షూటింగ్‌ విరామ సమయంలోనూ ఆయన పని గురించే ఆలోచిస్తారు. పుస్తకాలు చదవడం, ఇతరులతో మాట్లాడడం వంటివి చేస్తే పనిపై శ్రద్ధ పోతుందని భావించేవారు. దర్శకుడు షాట్‌కు ఎప్పుడు పిలిచినా వెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు. ఆయనకు సినిమాపై ఉండే అంకితభావం చూసి నేను స్ఫూర్తి పొందాను. సినిమా బాగా రావాలని ఆయనపడే తపన నన్ను నిజంగా ప్రేరేపించింది. అంతే కాదు అంత పెద్ద స్టార్ అయినప్పటికీ సెట్‌లో చిన్నచిన్న పనులు చేయడానికి కూడా వెనుకాడరు. కెమెరా ఫోకస్‌ ఎంతదూరం వస్తుందో అని కొలిచేందుకు టేప్‌ పట్టుకోవడంలోనూ సిబ్బందికి సాయం చేస్తారు. ఆ షూటింగ్‌లో ఆయన్ని చూసి విలువైన పాఠాలు నేర్చుకున్నా. వ్యక్తిగతంగా ఎదగడం కంటే టీమ్‌గా ముందుకు సాగడం మరింత ముఖ్యమని అర్థమైంది’’ అని విద్యా చెప్పారు. ఆమె మోహన్‌లాల్‌తో కలిసి నటించిన ‘చక్రం’ కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు.

ఇక బెంగాలీ చిత్రాలతో నటిగా ఎంట్రీ ఇచ్చిన విద్యాబాలన్ బాలీవుడ్‌ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ‘గురు’, ‘ఏక్‌లవ్య’, ‘పా’, ‘ఇష్కియా’, ‘డర్టీ పిక్చర్’, ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ వంటి చిత్రాలతో ఆమె మెప్పించారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘ప్యార్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘భూల్‌ భులయ్యా 3’(Bhool Bhulaiyaa 3)లోనూ విద్యా కీలకపాత్రలో కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని