Adani group: అదానీ గ్రూప్‌లో మరింత తగ్గనున్న ప్రమోటర్ల వాటా

Adani group: అదానీ గ్రూప్‌ కంపెనీల్లో తమ వాటాను తగ్గించుకోవాలని అదానీ కుటుంబం భావిస్తోంది. తద్వారా నగదు మొత్తాన్ని పెంచుకోవచ్చన్నది గ్రూప్‌ వ్యూహంగా కనిపిస్తోంది.

Published : 06 Jul 2023 15:28 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ కంపెనీల్లో ప్రమోటర్లు తమ వాటాలను మరింత తగ్గించుకోనున్నారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత గ్రూప్‌ సంస్థల్లో అదానీ కుటుంబం తమ వాటాలను విక్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వాటాలను తగ్గించుకోవాలని చూస్తోంది. నగదు నిల్వలను పెంచుకొనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పెట్టుబడుల వాతావరణంలో అనిశ్చితి ఏర్పడిన నేపథ్యంలో నగదు నిల్వలను పెంచుకోవడం ద్వారా కొత్త అవకాశాలను అందుకోవచ్చన్నది అదానీ గ్రూప్‌ వ్యూహంగా కనిపిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: అదానీ గ్రూప్‌లోకి జీక్యూజీ డబ్బుల వరద.. మరోసారి భారీ పెట్టుబడి

హిండెన్‌ బర్గ్‌ నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌ తన వాటాల విక్రయం మొదలు పెట్టింది. గత కొన్ని నెలల్లో వివిధ సందర్భాల్లో 3 బిలియన్‌ డాలర్లు విలువైన వాటాలను అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ జీక్యూజీ పార్ట్‌నర్స్‌కు విక్రయించింది. గత నెల అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌కు చెందిన 1.8 కోట్ల షేర్లు, అదానీ గ్రీన్‌ ఎనర్జీకి చెందిన 3.52 కోట్ల షేర్లు జీక్యూజీ ఇతర ఇన్వెస్టర్లతో కలిసి కొనుగోలు చేశాయి. జూన్‌ 30న అదానీ గ్రూప్‌లోని ప్రమోటర్‌ సంస్థ అయిన ఫోర్చిట్యూడ్‌ ట్రేడ్‌.. అదానీ ట్రాన్స్‌మిషన్‌లో తనకు ఉన్న 3.04 శాతం పూర్తి వాటాను రూ.2,665 కోట్లకు విక్రయించింది. 

ప్రస్తుతం అదానీ గ్రూప్‌ లిస్టెడ్‌ సంస్థల్లో అదానీ గ్రీన్‌ ఎనర్జీ, ఏసీసీ లిమిటెడ్‌ మినహా మిగిలిన కంపెనీల్లో అదానీ కుటుంబానికి 60 శాతానికి పైగా వాటా ఉంది. ఈ వాటాను తగ్గించుకోవాలని అదానీ ఫ్యామిలీ చూస్తోంది. తనఖా పెట్టిన షేర్లలో చాలా వరకు హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపేందుకు గ్రూప్‌ విడిపించింది. ఇప్పుడు నగదు మొత్తాన్ని పెంచుకోవాలని గ్రూప్‌ చూస్తోంది. దీనికి తోడు పోర్టులు, ఎయిర్‌పోర్టులు, గ్రీన్‌ ఎనర్జీ వంటి ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి పెట్టాలని గ్రూప్‌ భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని