Adar Poonawalla: అదర్‌ పూనావాలాకు లండన్‌లో ఖరీదైన భవనం.. రూ.1,445 కోట్లతో కొనుగోలు!

Adar Poonawalla: సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదర్‌ పూనావాలా లండన్‌లో దాదాపు రూ.1,445 కోట్లతో ఓ ఖరీదైన విలాసవంత భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం.

Published : 12 Dec 2023 19:15 IST

Adar Poonawalla | దిల్లీ: భారత్‌కు చెందిన వ్యాక్సిన్‌ తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదర్‌ పూనావాలా (Adar Poonawalla) లండన్‌లో ఓ విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు 138 మిలియన్‌ పౌండ్లతో (సుమారు రూ.1,445 కోట్లు) సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒప్పందం ఖరారైనట్లు కంపెనీ వర్గాలు ధ్రువీకరించాయని సీఎన్‌బీసీ టీవీ18 వెల్లడించింది. భారత్‌లో విస్తృతంగా పంపిణీ చేసిన కరోనా వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేసిన విషయం తెలిసిందే.

లండన్‌లోని హైడ్‌ పార్క్‌ ప్రాంతంలో ఉన్న అబెర్‌కాన్వే హౌస్‌ను పూనావాలా కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని విస్తీర్ణం 25 వేల చదరపు అడుగులు. పోలండ్‌కు చెందిన దివంగత వ్యాపారవేత్త జాన్ కుల్జిక్ కుమార్తె డొమినికా కుల్జిక్ నుంచి అదర్‌ పూనావాలా (Adar Poonawalla) దీన్ని కొనుగోలు చేసినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన యూకే అనుబంధ సంస్థ సీరం లైఫ్‌ సైన్సెస్‌ ఈ భవనాన్ని సొంతం చేసుకోనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.

లండన్‌లో ఈ ఏడాది అత్యంత ఖరీదైన ఇల్లుగా ఇది నిలవనున్నట్లు సమాచారం. అలాగే లండన్‌లో ఇప్పటి వరకు ఇదే రెండో అత్యంత ఖరీదైన ఇల్లుగా కూడా రికార్డుల్లోకి ఎక్కుతుందని పలువురు స్థానిక రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు తెలిపారు. అయితే, తాజా కొనుగోలుతో పూనావాలా కుటుంబం లండన్‌కు మకాం మార్చే అవకాశాలేమీ లేవని సీరం లైఫ్‌ సైన్సెస్‌కు చెందిన ఓ కీలక వ్యక్తిని ఉటంకిస్తూ ఫైనాన్షియల్‌ టైమ్స్‌ తెలిపింది. ప్రస్తుతానికి కంపెనీ కార్యకలాపాలకు ఇది కేంద్రంగా ఉంటుందని పేర్కొంది. అలాగే పూనావాలా కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లినప్పుడు ఈ భవనంలోనే ఉంటారని వెల్లడించింది.

లండన్‌లో ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన భవనంగా 2-8ఏ రట్లాండ్‌ గేట్‌ నిలిచింది. సౌదీ మాజీ యువరాజు సుల్తాన్‌ బిన్‌ అబ్దులాఅజిజ్‌కు చెందిన ఎస్టేట్ దీన్ని 2020 జనవరిలో 210 మిలియన్‌ పౌండ్లకు కొనుగోలు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, దీని వాస్తవ కొనుగోలుదారుడు చైనాకు చెందిన స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండ్‌ వ్యవస్థాపకుడు ‘హుయ్ కా యాన్‌’గా గుర్తించినట్లు గత ఏడాది ఫైనాన్షియల్ టైమ్స్‌ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని