Amazon: ఇక చాలు.. ఆఫీసుకు రావాల్సిందే! ఉద్యోగులకు అమెజాన్‌ వార్నింగ్

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసే ఉద్యోగులు ఇకపై తప్పనిసరిగా వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని అమెజాన్‌ (Amazon) సీఈవో స్పష్టం చేశారు. కంపెనీ నిబంధనను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.

Updated : 29 Aug 2023 12:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా పరిస్థితుల కారణంగా కార్పొరేట్‌ సంస్థలు ఉద్యోగులను వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Work From Home) చేసేందుకు అనుమతించాయి. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో వారు ఆఫీసులకు వచ్చి పనిచేయాలని సంస్థలు సూచిస్తున్నాయి. అయితే, కొన్ని సంస్థల ఉద్యోగులు మాత్రం కంపెనీ ఆదేశాలను ఖాతరు చేయడంలేదు. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు ఉద్యోగులకు అల్టిమేటం జారీచేస్తున్నాయి. తాజాగా అమెజాన్‌ (Amazon) సీఈవో యాండీ జెస్సీ (Andy Jassy) ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. వారంలో మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్‌కు రావాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కఠన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

‘‘ఇకపై వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయడం కుదరదు. వారంలో మూడు రోజులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆఫీసుకు రావాలి. ఇది సంస్థ నిబంధన. ఈ నియమావళి పాటించడం ఇష్టం లేని వారు సంస్థ నుంచి వెళ్లిపోవచ్చు’’అని కంపెనీ అంతర్గత సమావేశంలో ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే.. ఉద్యోగులు మే నెల నుంచి వారంలో మూడు రోజులు కార్యాలయాలకు రావాలని అమెజాన్‌ సూచించింది. అయితే, కంపెనీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అప్పట్లో కొంత మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. దీంతో కంపెనీ ఆ నిర్ణయంపై కాస్త వెనక్కి తగ్గినా.. మరోసారి ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 

కొద్ది రోజుల క్రితం మెటా సైతం ఉద్యోగులు ఆఫీసుకు రావాలని ఆదేశించింది. వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలని సూచించింది. ఒకవేళ నియామవళిని ఉల్లంఘిస్తే ఇంటికెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. వీటితోపాటు గూగుల్, మైక్రోసాఫ్ట్‌ వంటి ఇతర సంస్థలు కూడా తమ ఉద్యోగులు వారంలో మూడు రోజులు తప్పనిసరిగా కార్యాలయాల నుంచే పనిచేయాలని సూచించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని