Life Insurance: యుక్త వయసులో జీవిత బీమా అవసరమా?

యుక్త వయసులో జీవిత బీమా తీసుకోవడం సరైనదేనా? ముందుగా తీసుకోవడం వల్ల ప్రయోజనమెంత?

Published : 27 Oct 2023 17:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక కుటుంబానికి ప్రాథమిక అవసరాలు (ఆహారం, బట్టలు, ఇల్లు) తీరడం ఎంత ముఖ్యమో.. కుటుంబంలో సంపాదించే వారికి జీవిత బీమా పాలసీ కూడా అంతే అవసరం. గతంలో బీమా గురించి చాలా మంది నిర్లక్ష్యం చేసినా.. కొవిడ్‌-19 గుణపాఠంతో బీమా అవసరాన్ని చాలా మంది గుర్తించారు. భారత్‌ అత్యధిక యువ జనాభాను కలిగి ఉంది. 35 సంవత్సరాల కంటే తక్కువ వయసుగల వారు 66% మంది ఉన్నారు. అయితే, యుక్త వయసులో ఉన్నవారు.. తమపై ఆధారపడిన వారు ఉన్నప్పటికీ జీవిత బీమాను కొనుగోలు చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా బీమా పాలసీ ముందుగానే తీసుకుంటే ముందు నుంచీ బీమా రక్షణ పొందడమే కాకుండా అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ప్రీమియం తక్కువ..

వయసు పెరిగే కొద్దీ బీమా పాలసీ ప్రీమియంలు కూడా పెరుగుతూ ఉంటాయి. చిన్న వయసులో బీమా కంపెనీలు ప్రీమియం తగ్గించడానికి కొన్ని కారణాలు లేకపోలేదు. యుక్త వయసులో చాలా మందికి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక మరణాలు కూడా తక్కువే. అందువల్ల యుక్త వయసులోనే పాలసీ తీసుకుని కొంత వరకు ప్రీమియం ఆదా చేసుకోవచ్చు. ఉదా: ౨౫ ఏళ్ల వయసు గల వ్యక్తి 20 ఏళ్ల కాలపరిమితితో రూ.1 కోటి బీమా హామీతో టర్మ్ ప్లాన్ తీసుకుంటే, వార్షిక ప్రీమియం దాదాపు రూ.10,500 వరకు చెల్లించాలి. 30 ఏళ్ల వయసులో పాలసీ తీసుకుంటే దాదాపు రూ.13,800 అవుతుంది. 40 ఏళ్లకు పాలసీ తీసుకుంటే రూ.21,500 చెల్లించాలి. అదే 50 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆగి పాలసీ తీసుకుంటే వార్షిక ప్రీమియం దాదాపు రూ.37,000 వరకు చెల్లించవలసి ఉంటుంది.

బృంద బీమా

కెరీర్‌ ప్రారంభం అయినప్పుడు కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు గ్రూప్‌ టర్మ్‌ బీమా ప్లాన్‌ కింద కవరేజీని అందిస్తారు. ఇది కొంత మొత్తంలో ఆర్థిక రక్షణను అందించినప్పటికీ.. ఈ ఆర్థిక భద్రత కంపెనీలో పనిచేసే వరకు మాత్రమే ఉంటుందని గుర్తుంచుకోవాలి. మీరు ఉద్యోగాన్ని మారినప్పుడు, ఈ కవరేజ్‌ మీకు వర్తించదు. మీ కొత్త కంపెనీ ఉద్యోగుల కోసం గ్రూప్‌ కవర్‌ను కలిగి ఉండకపోవచ్చు. దురదృష్టకరమైన పరిస్థితులు ఎప్పుడైనా ఎదురుకావచ్చు. ఇలాంటప్పుడు జీవిత బీమా లేకపోతే కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. యుక్తవయసులో ఉన్నవారు తరచుగా ఉద్యోగాలు మారుతుంటారు. కాబట్టి విడిగా టర్మ్‌ ప్లాన్‌ తీసుకోవడం చాలా మంచిది.

రైడర్స్‌

రైడర్లు లేదా యాడ్‌-ఆన్‌లు టర్మ్‌ బీమా పాలసీకి తోడయితే చాలా సందర్భాల్లో అదనపు బీమా కవరేజీ పొందొచ్చు. జీవిత బీమా ప్లాన్‌కు సంబంధించి కవరేజీని మెరుగుపరచుకోవడానికి ఒకరి అవసరాలను బట్టి.. ప్రమాద, అంగవైకల్య, ప్రీమియం మాఫీ లేదా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ వంటి వివిధ రైడర్‌లను ఎంచుకోవచ్చు. సాధారణంగా యుక్తవయసులో టర్మ్‌ ప్లాన్‌ను తీసుకుంటే ఇలాంటి రైడర్లను సులువుగా పొందొచ్చు. వయసు పెరిగేకొద్దీ బీమా కంపెనీలు కొన్ని రైడర్స్‌ను ఇవ్వకపోవచ్చు.

క్లెయిమ్ సెటిల్మెంట్..

యుక్త వయసులో బీమా తీసుకున్నవారి క్లెయిమ్లను తిరస్కరించే అవకాశాలు తక్కువే. అదే మధ్యస్థ వయసు తరువాత బీమా పాలసీ తీసుకున్నవారికి అనేక ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. కాబట్టి, బీమా కంపెనీలు అలాంటి క్లెయిమ్‌లు జాప్యం చేయొచ్చు లేదా తిరస్కరించొచ్చు. ఈ కారణం చేత నిపుణులు వీలైనంత త్వరగా జీవిత బీమా ఎంచుకోమని చెబుతుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని