BigBasket: మా డిస్కౌంట్లతో కస్టమర్లకు రూ.1,515 కోట్లు ఆదా: బిగ్‌బాస్కెట్‌

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ తీసుకొని నిత్యావసరాలను ఇంటికి చేర్చే బిగ్‌బాస్కెట్‌ 2022లో 750 మిలియన్‌ ఉత్పత్తులను 8.5 మిలియన్ల నివాసాలకు పంపిణీ చేసింది. 

Updated : 30 Dec 2022 11:11 IST

దిల్లీ: ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 55 నగరాల్లో 16 కోట్ల ఆర్డర్లను కస్టమర్లకు అందించినట్లు ఆన్‌లైన్‌లో నిత్యావసరాలను డెలివరీ చేసే టాటా ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన బిగ్‌బాస్కెట్‌ (BigBasket) తెలిపింది. అలాగే సంస్థ అందించిన రాయితీలు, ప్రోమో కోడ్లు సహా ఇతర ఆఫర్ల ద్వారా వినియోగదారులు రూ.1,515 కోట్లు ఆదా చేసుకున్నట్లు ‘బిగ్‌రీక్యాప్‌’ పేరిట విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది.

అత్యధికంగా టామాటాలను డెలివరీ చేసినట్లు బిగ్‌బాస్కెట్‌ తెలిపింది. తర్వాత అత్యధికంగా ఆర్డర్లు అందిన జాబితాలో కొత్తిమీర ఉన్నట్లు పేర్కొంది. 100 గ్రాములకు సగటున రూ.2 చొప్పున దాదాపు 400 కిలోల కొత్తిమీరను వినియోగదారులకు పంపిణీ చేసినట్లు తెలిపింది. తర్వాత 3,97,708 డైపర్లను డెలివరీ చేసినట్లు పేర్కొంది. మొత్తంగా 75 కోట్ల ఉత్పత్తులను ఈ ఏడాది అందించినట్లు తెలిపింది. అత్యధికంగా కర్ణాటక నుంచి ఆర్డర్లు వచ్చినట్లు వెల్లడించింది. 35,565 మంది సిబ్బందితో 85 లక్షల ఇళ్లకు సేవలు అందించినట్లు తెలిపింది.

అత్యధికంగా ఒకరోజు 5,80,000 ఆర్డర్లు డెలివరీ చేసినట్లు బిగ్‌బాస్కెట్‌ పేర్కొంది. సాయంత్రం 7- 9 గంటల మధ్య అత్యధిక ఆర్డర్లు అందుతున్నట్లు వెల్లడించింది. టాటా గ్రూప్‌ నేతృత్వంలో ఉన్న ఈ సంస్థ ఇటీవలే 200 మిలియన్‌ డాలర్ల నిధుల్ని సమీకరించింది. 2025 నాటికి పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లాలని యోచిస్తోంది. మరోవైపు వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 400 స్టోర్లను తెరిచేందుకు యోచిస్తోంది.

బిగ్‌బాస్కెట్‌ ఇటీవల హైదరాబాద్‌లో రిటైల్‌ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇందులో తాజా కూరగాయలు, పళ్లతోపాటు దాదాపు 4,000కు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని బిగ్‌బాస్కెట్‌ సహ వ్యవస్థాపకుడు వి.ఎస్‌. సుధాకర్‌ తెలిపారు. దాదాపు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశామన్నారు. ఆన్‌లైన్‌ వినియోగదారులతోపాటు, నేరుగా వెళ్లి కొనుగోలు చేసేవారిని ఆకట్టుకునేలా ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మార్చి నాటికి మరో మూడు కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా తదితర నగరాల్లో కలిపి మొత్తం 24 కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో స్టోరు ఏర్పాటుకు రూ.కోటి వరకూ పెట్టుబడి పెడుతున్నామని, 15 మంది ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని