Bill Gates: బిల్‌ గేట్స్‌ మెచ్చిన నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ ఇదే..!

Bill Gates: ఏటా వేసవికి ముందు బిల్‌ గేట్స్‌ తన ఫాలోవర్లకు కొన్ని పుస్తకాల జబితాను సూచిస్తుంటారు. తాజాగా పుస్తకాలతో పాటు వెబ్‌సిరీస్‌, పాటలను కూడా షేర్‌ చేశారు.

Published : 02 Jun 2023 01:43 IST

వాషింగ్టన్‌: మైక్రోసాఫ్ట్‌ సహ- వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌ గేట్స్‌ (Bill gates) ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు. యూట్యూబ్‌ సహా సోషల్‌ మీడియాలో వీడియోలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు ఇలా వివిధ రకాలుగా తన ఫాలోవర్లకు కొత్త సమాచారాన్ని అందజేస్తుంటారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్‌, అంటువ్యాధులపై ఆయన ప్రధానంగా దృష్టి సారిస్తుంటారు. అలాగే టెక్నాలజీలో వస్తున్న మార్పులు వాటి ప్రభావంపై కూడా మాట్లాడుతుంటారు.

ఈ క్రమంలో ఏటా అమెరికాలో వేసవికి ముందు కొన్ని పుస్తకాల జాబితాను గేట్స్ నోట్స్‌ (Gates Notes) బ్లాగ్‌ ద్వారా షేర్‌ చేస్తారు. వీలైతే వాటిని చదవాలని సూచిస్తుంటారు. ఈసారి కూడా బిల్‌ గేట్స్‌ కొన్ని పుస్తకాల పేర్లను ప్రస్తావించారు. అయితే, పుస్తకాలతో పాటు ఈసారి వెబ్‌ సిరీస్‌లు, పాటల జాబితాను కూడా పంచుకోవడం విశేషం. మరి అవేంటి.. వాటి విశిష్టతలేంటో చూద్దాం..

పుస్తకాలు..

టుమారో, అండ్‌ టుమారో, అండ్‌ టుమారో..

ఈ పుస్తక రచయిత గాబ్రియెల్‌ జెవిన్‌. ఇది ఒక నవల. ఆన్‌లైన్‌ వీడియో గేమ్స్‌ ఆడుతూ పెరిగిన ఇద్దరు మిత్రుల కథ. కాలేజ్‌కి వచ్చే సరికి వారు సొంతంగా గేమ్స్‌ను రూపొందించడం ప్రారంభిస్తారు. ఈ పుస్తకం తన చిన్ననాటి స్నేహితుడు పాల్‌ అలెన్‌తో గడిపిన రోజులను గుర్తుచేసిందని బిల్‌ గేట్స్‌ తెలిపారు. మైక్రోసాఫ్ట్‌ స్థాపన, ఆ సమయంలో ఇరువురు చేసిన కృషిని ఈ పుస్తకం జ్ఞప్తికి తెచ్చినట్లు వెల్లడించారు. గత ఏడాది వచ్చిన గొప్ప పుస్తకాల్లో ఇదొకటి తెలిపారు. రచయిత జెవిన్‌ పాత్రలను చాలా చక్కగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.

బోర్న్‌ ఇన్‌ బ్లాక్‌నెస్‌..

ఈ పుస్తకం ఆఫ్రికా దేశాల చరిత్రను తెలియజేస్తుందని బిల్‌ గేట్స్‌ (Bill Gates) తెలిపారు. దీని రచయిత పేరు ఫ్రెంచ్‌. వాస్తవానికి, ఐరోపావారు ఆఫ్రికాకు రావడానికి ముందే వివిధ ఆఫ్రికన్ రాజ్యాలు పాలన, సైనిక శక్తి, వాణిజ్యం, కళ, పరిశోధనల పరంగా యూరప్‌నకు పోటీనివ్వగలిగే నగరాలను స్థాపించాయని ఆయన వివరించారు. ఈ పుస్తకం చదివిన తర్వాత మరింత తెలుసుకోవాలనే ఉత్సుకత తనలో కలిగినట్లు గేట్స్‌ తెలిపారు.

వెబ్‌సిరీస్‌..

బోర్గెన్‌: ఇది అమెరికాలో నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో అందుబాటులో ఉన్నట్లు గేట్స్‌ వెల్లడించారు. ఇది ఒక డానిష్‌ పొలిటికల్‌ డ్రామా. క్లిష్ట రాజకీయ పరిస్థితులను అక్కడి తొలి మహిళా ప్రధాని ఎలా అధిగమించారో దీంట్లో చూపించారు. రాజకీయ సంకీర్ణాలు ఎలా ఏర్పడతాయి? ఎలా ముందుకెళ్తాయో చక్కగా చూపించినట్లు గేట్స్‌ వెల్లడించారు. ఈ సిరీస్‌ నుంచి చాలా నేర్చుకున్నట్లు తెలిపారు. రాజకీయాలు, కూటముల ఏర్పాటు, నాయకత్వంలో ఉన్న సవాళ్లు, విజయాలపై ఆసక్తి ఉన్నవాళ్లు దీన్ని చూడాలని గేట్స్‌ సూచించారు.

పాటల జాబితా..

హాలిడే, ఫీల్స్‌ దిస్‌ గుడ్‌, ఫీలింగ్‌ గుడ్‌, ఆన్‌ ది సన్నీ సైడ్‌ ఆఫ్‌ ది స్ట్రీట్‌, షూ బీ డూ బీ డూ డా డే, ది విండ్‌ క్రైస్‌ మేరీ, లీన్‌ ఆన్‌ మీ, ఇట్స్‌ ఏ న్యూ డే, దిస్‌ లవ్‌, లేడీ, బైలాండో- ఇంగ్లిష్‌ వెర్షన్‌, డోంట్‌ ఫేడ్‌ సహా మొత్తం 34 పాటలను గేట్స్‌ షేర్‌ చేశారు. వీటిలో కొత్త, పాత పాటలు మిళితమై ఉన్నట్లు తెలిపారు. ఇవన్నీ స్పోటిఫైలో అందుబాటులో ఉన్నాయి. మొత్తం పాటల జాబితా గేట్స్‌ నోట్స్‌ బ్లాగ్‌లో అందుబాటులో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని