Toys: క్వాలిటీ మార్క్‌లేని బొమ్మల విక్రయాలు.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు

ఆటబొమ్మల విషయంలో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశించింది. వాటిని ఉల్లంఘించిన రిటైలర్లపై తాజాగా సోదాలు నిర్వహించి చర్యలు తీసుకుంటోంది.

Published : 12 Jan 2023 17:15 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, విక్రయశాలల్లోని హామ్లీస్, ఆర్చీస్‌తో సహా ప్రధాన రిటైల్ దుకాణాల నుంచి గత నెలలో 18,600 ఆటబొమ్మలను బీఐఎస్‌ (BIS) నాణ్యతా మార్క్ లేని కారణంగా స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వం బుధవారం తెలిపింది. మరోవైపు ఆటబొమ్మల నాణ్యత నియంత్రణా ఆదేశాలను ఉల్లంఘించినందుకుగానూ మూడు ప్రధాన ఇ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌కు ‘వినియోగదారుల రక్షణ నియంత్రణ సంస్థ (CCPA)’ నోటీసులు జారీ చేసింది.

2021 జనవరి 1 నుంచి జాతీయ ప్రమాణాల నిర్దేశక సంస్థ ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)’ పేర్కొన్న భద్రతా నిబంధనలకు అనుగుణంగా బొమ్మలు ఉండడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయ తెలిసిందే. ‘‘బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా లేని బొమ్మల విక్రయాలపై దేశీయ తయారీదారుల నుంచి మాకు ఫిర్యాదులు అందాయి. మేం గత నెలలో 44 సోదాలు నిర్వహించాం. ప్రధాన రిటైల్ దుకాణాల నుంచి 18,600 బొమ్మలను స్వాధీనం చేసుకున్నాం’’ అని బీఐఎస్‌ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ విలేకరుల సమావేశంలో తెలిపారు.

దేశంలోని ప్రధాన విమానాశ్రయాలు, మాల్స్‌లో ఉన్న హ్యామ్లీస్, ఆర్చీస్, డబ్ల్యూహెచ్ స్మిత్, కిడ్స్ జోన్, కోకోకార్ట్‌తో సహా రిటైల్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించినట్లు తివారీ తెలిపారు. నిబంధనల్ని ఉల్లంఘించిన రిటైలర్లపై బీఐఎస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీఐఎస్‌ క్వాలిటీ మార్క్ లేకుండా బొమ్మలు విక్రయిస్తున్నందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లకు కూడా నోటీసులు జారీ చేశామని సీసీపీఏ చీఫ్ నిధి ఖరే తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని