Retirement Plan: రిటైర్‌మెంట్ ప్లాన్ ఎంచుకునే ముందు ఏం చూడాలి?

ద్ర‌వ్యోల్బ‌ణం అనేది భ‌విష్య‌త్తులో డ‌బ్బు విలువ‌ను త‌గ్గిస్తుంది.

Updated : 29 Jul 2022 16:52 IST

సామాజిక అంశాల్లో చాలా వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గ‌తంలో ఉమ్మ‌డి కుటుంబాలు ఎక్కువ‌గా ఉండేవి. ఒక వ‌య‌సు వ‌చ్చిన త‌ర్వాత పెద్ద‌లు, పని చేయ‌లేక‌పోయినా వారి బాధ్య‌త‌ పిల్ల‌లు చూసుకునేవారు. పిల్ల‌లు కూడా పెద్ద‌ల అనుభ‌వంతో కూడిన స‌ల‌హాల‌ను తీసుకుంటూ ముందుకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు యువ‌త మెరుగైన ఆదాయ మార్గాల కోసం త‌ల్లిదండ్రులను విడిచి వేరే ప్రాంతాల‌కు వెళ్తున్నారు. ఫ‌లితంగా పెద్ద‌ల బాగోగులు చూసుకునేందుకు ఎవ‌రూ ఉండ‌డం లేదు. పైగా జీవ‌న వ్య‌యం కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇలాంటి స్థితిలో ఎవ‌రికి వారు రిటైర్‌మెంట్ ప్లాన్ గురించి త‌ప్ప‌నిస‌రిగా ఆలోచించాలి.

సాధార‌ణంగా ప‌ద‌వీవిర‌మ‌ణ త‌ర్వాత బాధ్య‌త‌లు త‌గ్గుతాయి. కాబ‌ట్టి ఎక్కువ ఖ‌ర్చులు ఉండ‌వ‌ని అనుకుంటారు. కానీ ఇది ఒక అపోహ మాత్ర‌మే. నిజానికి ఖ‌ర్చులు పెరిగే అవ‌కాశం ఉంది. అందువల్ల స‌రైన ప‌దవీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌ను ఎంపిక చేసుకోవాలి. ప్ర‌స్తుతం మార్కెట్లో అనేక పెన్షన్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటినే రిటైర్‌మెంట్ ప్లాన్లు అని కూడా అంటారు. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత స‌క్ర‌మంగా ఆదాయాన్ని అందించ‌డ‌మే వీటి ప్ర‌ధాన ల‌క్ష్యం. పెట్టుబ‌డిదారులు పెన్ష‌న్ ప్లాన్‌ని ఎంచుకునే ముందు కొన్ని అంశాల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అధిగమించి రాబ‌డి ఇచ్చేలా ఉండాలి..
ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత జీవితం కోసం పెట్టుబ‌డులు పెట్టేవారు.. మీరు ఎంచుకున్న పెట్టుబ‌డి మార్గం ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మించి రాబ‌డులు ఇచ్చేలా చూసుకోవ‌డం చాలా ముఖ్యం. ఎందుకంటే ద్ర‌వ్యోల్బ‌ణం అనేది భ‌విష్య‌త్‌లో డ‌బ్బు విలువ‌ను త‌గ్గిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు.. ద్ర‌వ్యోల్బ‌ణ రేటు 6 శాతం అనుకుంటే ప్ర‌స్తుతం రూ.100 విలువ, ఏడాది త‌ర్వాత‌ రూ.94కి ప‌డిపోతుంది. అంటే ఇప్పుడు మీ నెల‌వారీ ఖ‌ర్చుల‌కు రూ.30 వేలు కావాల్సి వ‌స్తే.. మీరు అదే జీవితం గ‌డిపేందుకు ఏడాది త‌ర్వాత‌ నెల‌కు దాదాపు రూ.32 వేల వ‌ర‌కు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తుంది. అదే  10 సంవ‌త్స‌రాల త‌ర్వాత అయితే నెలకు దాదాపు రూ.54 వేలు అవ‌స‌ర‌మ‌వుతుంది. అందువ‌ల్ల ప‌ద‌వీ విర‌మ‌ణ జీవితం కోసం పెట్టుబ‌డుల‌ను ప్లాన్ చేసే వారు జీవ‌న స్థితిని త‌గ్గించుకోకుండా జీవించాలంటే ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మించి సానుకూల రాబ‌డిని ఇచ్చే పెట్టుబ‌డుల‌నే ఎంచుకోవాలి. 

2. రిస్క్‌..
ప‌ద‌వీ విర‌మ‌ణ ద‌గ్గ‌ర‌లో ఉండి.. పెన్ష‌న్ ప్లాన్‌ను ఎంచుకునేవారు.. అధిక రిస్క్ ఉన్న పెట్టుబ‌డుల‌ను ఎంచుకోక‌పోవ‌డ‌మే మంచిది. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత క్ర‌మ‌మైన ఆదాయం ఉండ‌దు. దీనికి తోడు పెట్టుబ‌డి పెట్టిన డ‌బ్బు కూడా పోతే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వ‌స్తుంది. అందువ‌ల్ల‌ హామీతో కూడిన రాబ‌డులు ఇచ్చే ప‌థ‌కాల‌ను ఎంచుకోవ‌డం మంచిది. ఒక‌వేళ రిస్క్ తీసుకోగ‌లిగిన వారైతే మొత్తం పెట్టుబ‌డుల‌లో 20 శాతం మాత్రం అధిక రిస్క్ ఉన్న పెట్టుబ‌డుల‌కు కేటాయించ‌వ‌చ్చు. అప్పుడు కూడా పెట్టుబ‌డుల‌ను ఎక్కువ కాలం కొన‌సాగించాల‌ని గుర్తుంచుకోండి.

3. తగిన పెన్షన్ ఉండాలి..
రిటైర్‌మెంట్ త‌ర్వాత త‌గిన పెన్ష‌న్ అందేలా ప్ర‌ణాళిక ఉండాలి. అలాగే అత్య‌వ‌స‌రాల కోసం కొంత మొత్తాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే వ‌య‌సు పెరిగే కొద్దీ ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉంటాయి. కాబ‌ట్టి ఆరోగ్య బీమా ఉన్న‌ప్ప‌టికీ, అత్య‌వ‌స‌రాల కోసం కొంత అద‌న‌పు మొత్తాన్ని బ్యాక‌ప్‌గా ఉంచుకోవడం మంచిది.

4. యాన్యుటీ ఎంత కాలానికి..?
రిటైర్‌మెంట్ ప్లాన్లు.. వివిధ రకాల యాన్యుటీల‌ను ఆఫ‌ర్ చేస్తుంటాయి. కొన్ని పెట్టుబ‌డులు వెంట‌నే పెన్ష‌న్‌ను అందిస్తే, మ‌రికొన్ని పెట్టుబ‌డులు పెట్టిన నిర్దిష్ట కాలం త‌ర్వాత పెన్ష‌న్‌ను అందిస్తాయి. అలాగే కొన్ని యాన్యుటీ ప్లాన్లు.. ప‌ద‌వీవిర‌మ‌ణ త‌ర్వాత‌ నిర్దిష్ట కాలానికి పెన్ష‌న్‌ను అందిస్తే, మ‌రికొన్ని జీవిత కాలం పెన్ష‌న్‌ను అందిస్తాయి. ఇంకొన్నేమో యాన్యుటీ ప్లాన్ తీసుకున్న వ్య‌క్తి మ‌ర‌ణించిన త‌ర్వాత అత‌డు/ఆమె జీవిత భాగ‌స్వామి లేదా నామినీకి పెన్ష‌న్ అందిస్తుంటాయి. వీటన్నింటినీ ప‌రిశీలించి మీ అవ‌స‌రాల‌కు త‌గిన ప్ర‌ణాళిక‌ను ఎంచుకోవ‌చ్చు.

5. ప‌న్ను నిబంధ‌న‌లు..
రిటైర్‌మెంట్ ప్లాన్‌ను ఎంచుకునే స‌మ‌యంలో ముఖ్యంగా చూడాల్సిన మ‌రో అంశం ప‌న్నులు. మీరు ఎంచుకున్న పెన్ష‌న్ ప్లాన్ ఆధారంగా ప‌న్ను వ‌ర్తిస్తుంది. కాబ‌ట్టి ప్లాన్‌ను ఎంచుకునే స‌మ‌యంలో వ‌ర్తించే ప‌న్నుల‌ను తెలుసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని