Malware: ప్లేస్టోర్‌లో మరో కొత్త మాల్‌వేర్‌.. ఈ 100 యాప్స్‌తో జాగ్రత్త!

ఆండ్రాయిడ్ (Android) ప్లే స్టోర్‌ (Play Store)లో మరో కొత్త మాల్‌వేర్‌ను గుర్తించినట్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. సుమారు 100కుపైగా యాప్‌లలో ఈ మాల్‌వేర్‌ను గుర్తించినట్లు తెలిపింది.

Published : 05 Jun 2023 19:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆండ్రాయిడ్‌ (Android) యూజర్లను వరుస మాల్‌వేర్‌ (Malware) భయాలు వెంటాడుతున్నాయి. స్పిన్‌వీల్‌ వంటి గేమింగ్‌ యాప్‌లతో రివార్డు పాయింట్లు, బహుమతుల పేరుతో యూజర్ల వ్యక్తిగత, బ్యాంకింగ్‌ సమాచారం సేకరిస్తున్న కొత్త యాప్‌ను డాక్టర్‌ వెబ్‌ (Doctor Web) అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. స్పిన్‌ ఓకే (Spin Ok) పేరుతో ఈ వైరస్‌ ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌ (Play Store)లోని సుమారు 100 యాప్‌లలో ఉన్నట్లు డాక్టర్‌ వెబ్‌ వెల్లడించింది. యూజర్లు వెంటనే తమ ఫోన్లలోంచి ఈ గేమింగ్ యాప్‌లను డిలీట్ చేయాలని సూచించింది. 

‘‘ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌లో ఉన్న 101 గేమింగ్‌ యాప్‌లలో స్పిన్‌ ఓకే మాల్‌వేర్‌ ఉన్నట్లు మా పరిశోధన బృందం గుర్తించింది. వీటిలో ఎక్కువ శాతం స్పిన్‌వీల్‌ గేమ్‌కు సంబంధించిన యాప్‌లు. రివార్డ్‌ పాయింట్లు, రోజువారీ బహుమతులు ఉంటాయనే మోసపూరిత ప్రకటనలతో యూజర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత స్పిన్‌ ఓకే మాల్‌వేర్‌ సాయంతో యూజర్ల ఫోన్‌లోని వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారంతోపాటు, ఫైల్స్‌ను హ్యాకర్లు సేకరిస్తున్నారు. ఇది ఒక స్పై మాల్‌వేర్‌. ఈ మాల్‌వేర్‌ ఉన్న యాప్‌లను సుమారు 420 మిలియన్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. యూజర్లు వెంటనే వీటిని తమ డివైజ్‌లనుంచి తొలగించడం మేలు’’ అని డాక్టర్‌ వెబ్‌ తెలిపింది. యాప్‌ల జాబితా కోసం క్లిక్ చేయండి. 

  • యూజర్లు ఏదైనా యాప్‌లను డౌన్‌లోడ్ చేసే ముందు వాటి ప్లే ప్రొటెక్షన్‌ (Play Protection) సర్టిఫికేషన్‌ ఉందా? లేదా? అని చెక్ చేయాలి. యాప్‌ల పేరు సరిగా లేకుంటే వాటిని డౌన్‌లోడ్ చేయకపోవడం ఉత్తమం. ప్లే స్టోర్‌లో గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను ఎనేబుల్ చేయాలి. యూజర్లు డౌన్‌లోడ్‌ చేసే యాప్‌లలో మాల్‌వేర్‌ ఉంటే వెంటనే యూజర్‌కు ప్లే ప్రొటెక్ట్ అలర్ట్ మెసేజ్‌ పంపుతుంది.
  • ప్లే స్టోర్‌లో ఏదైనా యాప్‌కు రెడ్‌ ఫ్లాగ్‌ ఉంటే దాన్ని డౌన్‌లోడ్‌ చేయకపోవడం మేలు. అంతకుముందు ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన యూజర్లు అందులో ఏదైనా లోపాన్ని గుర్తిస్తే.. దానికి రెడ్‌ ఫ్లాగ్ ఇస్తారు. ఆఫర్లు, రివార్డు పాయింట్ల పేరుతో ఆకర్షించే గేమింగ్‌ యాప్‌లను కూడా డౌన్‌లోడ్ చేయొద్దని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని