Elon Musk - Modi: త్వరలో భారత్‌కు టెస్లా.. మోదీతో భేటీ అనంతరం ఎలాన్‌ మస్క్‌

Elon Musk - Modi: అమెరికా పర్యటనలో ఉన్న మోదీతో మస్క్‌ భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. భారత్‌లో టెస్లా ప్రవేశంపై స్పందించారు.

Updated : 21 Jun 2023 10:27 IST

వాషింగ్టన్‌: భారత్‌లో టెస్లా (Tesla) కార్యకలాపాలు వీలైనంత త్వరగా ప్రారంభమవుతాయని కంపెనీ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ అంశంపై ప్రకటన ఉండే అవకాశం ఉందని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ (Modi)తో ఆయన బుధవారం భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. మోదీతో భేటీ అద్భుతంగా జరిగిందని సమావేశం అనంతరం మస్క్‌ (Elon Musk) తెలిపారు.

స్థానిక చట్టాలను ట్విటర్‌ పాటించాల్సిందే..

స్థానిక ప్రభుత్వాల నియమ, నిబంధనల్ని పాటించడం తప్ప మరోమార్గం లేదని ట్విటర్‌ (Twitter) విషయంలో మస్క్‌ (Elon Musk) స్పందించారు. లేదంటే కార్యకలాపాలు మూసివేయాల్సి వస్తుందని తెలిపారు. సాగు చట్టాలపై రైతుల ఆందోళనల సమయంలో ట్విటర్‌పై భారత ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందంటూ ఇటీవల ట్విటర్‌ మాజీ సీఈఓ జాక్‌ డోర్సే ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో మస్క్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయా దేశాల చట్టాలను పాటించాల్సిందేనని మస్క్‌ ఉద్ఘాటించారు. నిబంధనలకు లోబడే వీలైనంతలో వాక్‌ స్వేచ్ఛను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

వచ్చే ఏడాది భారత్‌కు..

వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే యోచనలో ఉన్నట్లు మస్క్‌ (Elon Musk) తెలిపారు. సాధ్యమైనంత త్వరలో భారత్‌లో టెస్లా ప్రవేశం ఉంటుందని తాను బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రధాని మోదీ (Modi) నుంచి మంచి సహకారం లభిస్తోందని వెల్లడించారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే దీనిపై ఓ సానుకూల ప్రకటన ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఒక్క ప్రకటనలో తాము దీన్ని తేల్చేయాలనుకోవడం లేదని.. భారత్‌తో సంబంధాల విషయంలో తమ నిర్ణయం కీలకంగా మారనుందని పేర్కొన్నారు.

మోదీకి అభిమానిని..

ఇతర పెద్ద దేశాలతో పోలిస్తే భారత్‌లో అవకాశాలు మెండుగా ఉన్నాయని మస్క్‌ అభిప్రాయపడ్డారు. భారత భవిష్యత్‌పై తాను చాలా ఆసక్తిగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై మస్క్‌ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌పై మోదీ (Modi)కి చాలా శ్రద్ధ ఉందని వ్యాఖ్యానించారు. దేశంలో పెట్టుబడుల పెట్టాలని ఆయన ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. తాను మోదీకి అభిమానని చెప్పారు. సౌర ఇంధనంలో పెట్టుబడులకూ అక్కడ గొప్ప అవకాశాలు ఉన్నాయన్నారు.

మస్క్‌ (Elon Musk)తో భేటీ గొప్పగా జరిగినట్లు మోదీ (Modi) ట్వీట్‌ చేశారు. ఇంధనం నుంచి ఆధ్యాత్మికత వరకు వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిపారు. దీనికి మస్క్‌ స్పందిస్తూ.. ‘‘మీతో మళ్లీ సమావేశం కావడం గౌరవంగా భావిస్తున్నా’’ అని అన్నారు.

మోదీ అమెరికా పర్యటన ఈ నెల 24 వరకు కొనసాగనుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం బయల్దేరిన ఆయన అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం న్యూయార్క్‌కు చేరుకున్నారు. ఆయనకు అమెరికాలో మన దేశ రాయబారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధు, ఐరాసలో శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులు విమానాశ్రయానికి వచ్చి మోదీని స్వాగతించారు. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని