Mukesh Ambani: ఈ దశాబ్దం ముగిసేనాటికి ఇంధన అవసరాలు రెట్టింపు: ముకేశ్‌ అంబానీ

భారతదేశంలో ఆర్థికవృద్ధి గణనీయంగా ఉందని ఈ క్రమంలో ఇంధన అవసరాలు కూడా ఈ దశాబ్దం చివరినాటికి రెట్టింపు అవుతాయని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ అభిప్రాయపడ్డారు. 

Updated : 03 Dec 2023 01:25 IST

గాంధీనగర్‌: భారతదేశంలో ఆర్థికవృద్ధి గణనీయంగా ఉందని ఈ క్రమంలో ఇంధన అవసరాలు కూడా ఈ దశాబ్దం చివరినాటికి రెట్టింపు అవుతాయని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (RIL) అధిపతి ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లోని పండిట్‌ దీన్‌దయాళ్‌ ఎనర్జీ యూనివర్సిటీ(PDEU)లో శనివారం నిర్వహించిన స్నాతకోత్సవ సభలో ముకేశ్‌ అంబానీ పాల్గొని మాట్లాడారు.

‘‘ప్రస్తుతం 3.5 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 40 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుంది. ఇంధనం విషయానికొస్తే..  భారత్‌కు పెద్ద మొత్తంలో ఇంధనం అవసరంఉంది. అది ఈ దశాబ్దం ముగిసేసరికి రెట్టింపు కావొచ్చు. ఆ లక్ష్యాన్ని అందుకోవడం కోసం భారత్‌ బలమైన ఇంధన సదుపాయాలను కల్పించడంలో పోటీ పడుతోంది. ఈ క్రమంలో పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటికి యువత తగిన పరిష్కారం చూపిస్తుంది’’అని ముకేశ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో గ్రీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేసేందుకు గిగా ఫ్యాక్టరీలను నిర్మించే పనిలో ముకేశ్‌ నిమగ్నమయ్యారు. ఇందుకోసం కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు.

‘‘కొత్త విషయాలు నేర్చుకోవడానికి విద్యార్థులు ఎప్పుడూ ఆసక్తి కనబర్చాలి. యూనివర్సిటీ చదువు పూర్తి చేసుకున్నంత మాత్రాన నేర్చుకోవడం ఆపకూడదు. జీవితంలో, వృత్తిలో విజయం సాధించాలంటే.. జీవితాంతం నిత్య విద్యార్థిలా ఉండాలి. ఎల్లప్పుడూ కరుణ చూపాలి. నిజాయతీగా జీవించాలి. అలాగే దేశభక్తి కలిగి ఉండాలి. భారతీయుడిని కావడం వల్లనే నేను ఇలా ఉన్నాను. జీవితం మిమ్మల్ని ఎటు తీసుకెళ్లినా దేశం కీర్తిని పెంచడానికి మీ వంతు కృషి చేయాలి’’అని విద్యార్థులకు సూచించారు. తప్పులు చేయడం సహజమేనని, విజయవంతమైన వ్యక్తులు కూడా తప్పులు చేసినా వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిన వారేనని అన్నారు. అందరూ ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని, సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహించకూడదని ముకేశ్‌ విద్యార్థులకు వివరించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని