Credit Score: వాట్సాప్‌లో ఉచితంగా క్రెడిట్‌ స్కోర్‌.. సేవల్ని ప్రారంభించిన ఎక్స్‌పీరియన్‌

Credit Score: ప్రముఖ క్రెడిట్‌ బ్యూరో సంస్థ ఎక్స్‌పీరియన్‌ వాట్సాప్‌ ద్వారా ఉచితంగా క్రెడిట్‌ స్కోర్‌ను అందించే సదుపాయాన్ని ప్రారంభించింది.  

Published : 14 Nov 2022 14:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక వ్యక్తి ఆర్థిక చరిత్ర క్రెడిట్‌ స్కోర్‌ చెప్పేస్తుంది. బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు రుణాలివ్వడానికి దీన్ని ఆధారం చేసుకుంటాయి. మంచి క్రెడిట్‌ స్కోర్‌ అంటే 750 కంటే ఎక్కువ ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణం మంజూరయ్యే అవకాశం ఉంది. అలాగే వడ్డీరేటులోనూ రాయితీ పొందడానికి వీలుంటుంది. అందుకే ఈ స్కోర్‌ తగ్గకుండా చూసుకోవాలి. చాలా క్రెడిట్‌ బ్యూరో సంస్థలు క్రెడిట్‌ స్కోర్‌ను అందిస్తున్నాయి. కొన్ని ఫీజు వసూలు చేస్తుండగా.. మరికొన్ని ఉచితంగానే అందజేస్తున్నాయి.

ఇటీవల ప్రముఖ క్రెడిట్‌ బ్యూరో సంస్థ ఎక్స్‌పీరియన్‌ వాట్సాప్‌ ద్వారా క్రెడిట్‌ స్కోర్‌ తెలుసుకునే సదుపాయాన్ని ప్రారంభించింది. దేశంలో ఈ సేవల్ని ప్రారంభించిన తొలి సంస్థ తమదేనని ఎక్స్‌పీరియన్‌ పేర్కొంది. త్వరగా, భద్రతతో, సులువుగా క్రెడిట్‌ స్కోర్‌ను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ఈ సేవల్ని అందుబాటులోకి తెచ్చామని తెలిపింది.

వాట్సాప్‌తో ఇలా తెలుసుకోండి..

  • 9920035444 నెంబరుకు ‘Hey’ అని వాట్సాప్‌ చేయండి.
  • పేరు, ఇ-మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నంబరు వంటి వివరాలను సమర్పించండి.
  • ఓటీపీ ద్వారా వివరాల్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది.
  • మీ క్రెడిట్‌ స్కోర్‌ వెంటనే సందేశం రూపంలో అందుతుంది.
  • పూర్తి నివేదిక ఇ-మెయిల్‌కు వచ్చేస్తుంది.
  • పాస్‌వర్డ్‌తో కూడిన అభ్యర్థన వల్ల మీ స్కోర్‌ను ఎవరూ చూసే అవకాశం ఉండదు.
  • పాస్‌వర్డ్‌ మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు సంక్షిప్త సందేశ రూపంలో అందుతుంది.

క్రెడిట్‌ స్కోర్‌ ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల ఏమైనా ఆర్థికపరమైన మోసం జరిగినా తెలిసిపోతుంది. అలాగే మీ ఆర్థిక లావాదేవీల్లో ఎక్కడైనా పొరపాటు జరిగినా వెంటనే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా కారణం వల్ల స్కోర్‌ తగ్గినట్లు గమనిస్తే వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చు. ఫలితంగా మీ స్కోర్‌ను మెరుగుపరచుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని