Satya Nadella: మీరు క్యాండీ క్రష్‌ ఆడతారా..? సత్య నాదెళ్లకు న్యాయమూర్తి ప్రశ్న!

క్యాండీ క్రష్‌ (Candy Crush) గేమ్‌ గురించి మీ అభిప్రాయం చెప్పాలని మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella)ను ఫెడరల్‌ కోర్టు జడ్డి అడిగిన ప్రశ్నకు.. ఆయన చెప్పిన సమాధానంతో కోర్టు గదిలో ఉన్నవారంతా సరదాగా నవ్వారు.

Published : 30 Jun 2023 19:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్: క్యాండీ క్రష్ (Candy Crush) గేమ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో మంది ఈ గేమ్‌ ఆడేందుకు ఇష్టపడుతుంటారు. కొద్ది రోజుల క్రితం భారత జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni) విమానంలో ప్రయాణిస్తూ.. ఈ గేమ్‌ ఆడుతున్న వీడియో వైరల్‌గా మారింది. అయితే, ధోని క్యాండీ క్రష్‌ ఆడుతున్నాడనే విషయం తెలియగానే.. ఈ గేమ్‌ను మూడు గంటల వ్యవధిలో మూడున్నర లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ధోనికి ఉన్న క్రేజ్‌ గురించి సోషల్‌ మీడియాలో మరోసారి చర్చ జరిగింది. తాజాగా క్యాండీ క్రష్‌ గేమ్‌ గురించి మైక్రోసాఫ్ట్‌ (Microsoft) సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) ఆసక్తికర కామెంట్లు చేశారు. క్యాండీ క్రష్‌ గేమ్‌ను తాను కూడా ఆస్వాదిస్తానని చెప్పారు.

యాక్టివిజన్‌ బ్లిజార్డ్‌ (Activision Blizzard) అనే వీడియో గేమింగ్‌ కంపెనీ కొనుగోలు లావాదేవీలకు సంబంధించిన నమోదైన కేసు విచారణలో భాగంగా ఫ్రాన్సిస్కో ఫెడరల్‌ కోర్టుకు సత్య నాదెళ్ల హాజరయ్యారు. విచారణలో భాగంగా న్యాయమూర్తికి, సత్య నాదెళ్లకు మధ్య కొద్దిసేపు సరదా సంభాషణ జరిగింది. క్యాండీ క్రష్‌ గేమ్‌ గురించి మీ అభిప్రాయం ఏంటని సత్య నాదెళ్లను న్యాయమూర్తి అడిగారు. క్యాండీ క్రష్‌ ఆటను తాను ఆస్వాదిస్తానని, దాంతోపాటు కాల్‌ ఆఫ్‌ డ్యూటీ గేమ్‌ను ఆడుతుంటానని సత్య నాదెళ్ల చెప్పడంతో.. కోర్టు గదిలో ఉన్నవారంతా సరదాగా నవ్వారు. ‘‘నాకు కన్‌సోల్ గేమ్స్‌, పీసీ గేమ్స్‌ అంటే ఇష్టం. ప్రత్యేకంగా మొబైల్‌ గేమ్స్‌ అంటే చాలా ఇష్టం’’ అని సత్య నాదెళ్ల చెప్పారు. 

యాక్టివిజన్‌ గేమ్స్‌ను మైక్రోసాఫ్ట్‌ ఉత్పత్తుల ద్వారా యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలని సత్య నాదెళ్ల భావిస్తున్నారు. ఇందుకోసం 68.7 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేయాలన్న ప్రయత్నాలకు యూఎస్‌ ఫెడరల్‌ ట్రేడ్ కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఒప్పందానికి సంబంధించిన న్యాయపరమైన సమస్యలు ఉన్నందున డీల్‌ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని