IPO: ఐపీఓకి దరఖాస్తు చేస్తుంటే

IPO: స్టాక్‌ మార్కెట్లో ఇప్పుడు ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌)లు జోరు నడుస్తోంది. అనేక సంస్థలు ప్రజల నుంచి మూలధన నిధులను సమీకరించేందుకు ముందుకు వస్తున్నాయి

Updated : 16 Feb 2024 08:26 IST

స్టాక్‌ మార్కెట్లో ఇప్పుడు ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌)లు జోరు నడుస్తోంది. అనేక సంస్థలు ప్రజల నుంచి మూలధన నిధులను సమీకరించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులో కొన్ని ప్రారంభ లాభాలను అందించి, పెట్టుబడిదారులకు కొత్త ఉత్సాహాన్నీ ఇచ్చాయి. దీంతో చాలామంది ఐపీఓలకు దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. కానీ, ఇందులో కొందరికే షేర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఓ (IPO)లో షేర్లు రావాలంటే అనుసరించాల్సిన కొన్ని వ్యూహాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

IPO: ఐపీఓలో షేర్ల కేటాయింపు పూర్తిగా యాంత్రికంగానే జరుగుతుందనేది గమనించాల్సిన విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ మానవ ప్రమేయం ఇందులో ఉండే అవకాశం లేదు. ఐపీఓ (IPO) దరఖాస్తులు అధికంగా వచ్చినప్పుడు, దరఖాస్తు చేసిన వారందిరకీ కనీసం ఒక లాట్‌ కేటాయించేలా ప్రాధాన్యత ఇస్తుంటారు.

 బహుళ డీమ్యాట్‌ ఖాతాలు: పెట్టుబడిదారులు తమకున్న అన్ని డీమ్యాట్‌ ఖాతాల నుంచీ ఐపీఓకి దరఖాస్తు చేస్తుంటారు. దీనివల్ల చాలా సందర్భాల్లో షేర్లు కేటాయింపు ఉండకపోవచ్చు. దీనికి బదులుగా కుటుంబ సభ్యుల పేరుమీద ఉన్న డీమ్యాట్‌ ఖాతాలన్నింటి నుంచీ ఐపీఓకి దరఖాస్తు చేయడం ఉత్తమం. ఏదో ఒక ఖాతాకు షేర్ల కేటాయింపు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 గరిష్ఠ ధర: రిటైల్‌ మదుపరులు గరిష్ఠ కట్‌-ఆఫ్‌ వద్ద బిడ్‌ వేయాలి. కొంతమంది షేర్లను ఏ ధరకు కొనాలనుకుంటున్నారనే విషయాన్ని పేర్కొంటారు. గరిష్ఠ ధరకు కేటాయింపులు జరిగినప్పుడు.. వారికి షేర్లు జారీ అయ్యే వీలుండదు. కాబట్టి, ఎప్పుడూ కట్‌-ఆఫ్‌ ధర వద్దే దరఖాస్తు చేయాలి.
షేర్‌-హోల్డర్‌ విభాగంలో: తమ అవకాశాలను మెరుగుపర్చుకునేందుకు పెట్టుబడిదారులు వాటాదారుల కోటానూ చూడాలి. దీనికోసం మాతృ సంస్థ వాటాలను ముందుగా కొనాలి. అప్పుడు షేర్‌-హోల్డర్స్‌ విభాగంలో దరఖాస్తు చేసుకునేందుకు వీలవుతుంది. ఇక్కడ పోటీ తక్కువగా ఉండే వీలుంది. కాబట్టి, షేర్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
చివరి నిమిషం వరకూ: ఐపీఓ చివరి తేదీ వరకూ చాలామంది దరఖాస్తు చేయరు. దీనివల్లా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి. బ్రోకర్లు చివరి రోజు నిర్ణీత వ్యవధికన్నా ముందే దరఖాస్తులను ఆమోదించడం నిలిపి వేయొచ్చు. ఒక సంస్థ ఐపీఓకి దరఖాస్తు చేయాలని అనుకున్నప్పుడు.. మొదటి రోజునే ఆ పని పూర్తి చేయాలి. వేచి చూడటం వల్ల ప్రయోజనమేమీ ఉండదు.
బహుళ విభాగాల్లో: వ్యక్తులు హెచ్‌ఎన్‌ఐ, రిటైల్‌ విభాగంలో దరఖాస్తు చేయలేరు. ఎందుకంటే.. ప్రతి దరఖాస్తుకూ ప్రత్యేక పాన్‌ అవసరం అవుతుంది. ఇలా దరఖాస్తు చేసినా, తిరస్కరించేందుకు ఆస్కారం ఉంటుంది. రిటైల్‌ మదుపరి ఐపీఓలో రూ.2లక్షలకు మించి విలువైన షేర్ల కోసం దరఖాస్తు చేసినప్పుడు ఎన్‌ఐఐ కోటాలో హెచ్‌ఎన్‌ఐగా పరిగణిస్తారు. ఈ విభాగంలో ఉన్న వారి పెట్టుబడి మిగులు, నికర విలువ రూ.2 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. మొత్తం ఐపీఓలో ఎన్‌ఐఐ విభాగానికి 15 శాతం కేటాయిస్తారు. కాబట్టి, చిన్న మదుపరులకు ఇది ప్రతికూలమైన అంశం.
యూపీఐ ద్వారా చెల్లింపు: యూపీఐతో ఐపీఓకి దరఖాస్తు లావాదేవీ పరిమితిని రూ.5లక్షలకు పెంచారు. యూపీఐ ద్వారా ఒక దరఖాస్తును మాత్రమే అనుమతిస్తారు. ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఆర్‌బీఎల్‌, యాక్సిస్‌ బ్యాంకులు ప్రస్తుతం 5 దరఖాస్తుల వరకూ అనుమతిస్తున్నాయి.
మదుపరులు ఎప్పటికప్పుడు మారుతున్న ఐపీఓ నిబంధనలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఐపీఓకి దరఖాస్తు చేసుకునేటప్పుడూ సంబంధిత సంస్థ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. కొన్ని పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇలాంటి వాటిని జాగ్రత్తగా గమనించాలి. కేవలం అందరూ మదుపు చేస్తున్నారు కాబట్టి, మనమూ దరఖాస్తు చేయాలనే ఆలోచన సరికాదు.
- మహావీర్‌ లునావత్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, పాంటోమ్యాథ్‌ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని