Forbes: ఫోర్బ్స్‌ మహిళా ధనవంతుల జాబితాలో భారత సంతతి మహిళలు

ఫోర్బ్స్‌(Forbes) తాజాగా విడుదల చేసిన అమెరికా తొలి వంద మంది సంపన్నుల జాబితాలో నలుగురు భారత సంతతి మహిళలు చోటు సంపాదించుకున్నారు. ఇక ఈ జాబితాలో తొలి స్థానంలో డైనీ హెండ్రిక్స్ ఉన్నారు.

Updated : 10 Jul 2023 18:37 IST

న్యూయార్క్‌: అమెరికాలో తొలి వంద మంది మహిళా సంపన్నుల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో నలుగురు భారత సంతతి మహిళలు చోటు దక్కించుకున్నారు. వ్యక్తిగత ఆస్తుల విలువతోపాటు, కంపెనీల్లో వారికున్న వాటాల విలువ ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో పెప్సికో మాజీ ఛైర్మన్‌, సీఈవో ఇంద్రా నూయీ(Indra Nooyi), ఆరిస్టా నెట్‌వర్క్ ప్రెసిడెంట్‌, సీఈవో జయశ్రీ ఉల్లాల్‌(Jayshree Ullal), సింటెల్‌ ఐటీ సంస్థ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథీ (Neerja Sethi), కాన్‌ఫ్లూయెంట్‌ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్ఖడే(Neha Narkhede) ఉన్నారు. 

జయశ్రీ ఉల్లాల్‌:  2.4 బిలియన్‌ డాలర్ల నికర ఆస్తులతో 15వ స్థానంలో ఉన్నారు. జయశ్రీ 2008 నుంచి ఆరిస్టా నెట్‌వర్క్‌ ప్రెసిడెంట్‌, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థలో ఆమెకు 2.4 శాతం వాటా ఉన్నట్లు ఫోర్బ్స్‌ తెలిపింది. అరిస్టా 2022లో 4.4 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 

నీర్జా సేథీ: సింటెల్‌ సహ వ్యవస్థాపకురాలిగా 990 మిలియన్‌ డాలర్ల సంపదతో నీర్జా జాబితాలో 25వ స్థానంలో కొనసాగుతున్నారు. 1980లో భర్త భరత్‌ దేశాయ్‌తో కలిసి నీర్జా సింటెల్‌ను స్థాపించారు. కంపెనీ నుంచి తన వాటా కింద ఆమె 510 మిలియన్‌ డాలర్లు పొందినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. 

నేహా నార్ఖడే: నేహా 520 మిలియన్‌ డాలర్ల సంపదతో 50వ స్థానంలో ఉన్నారు. నేహా గతంలో లింక్డ్‌ఇన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. లింక్డ్‌ఇన్‌లో కీలకమైన ఓపెన్ సోర్స్ మెసేజింగ్ సిస్టమ్‌ అపాచీ కఫ్కా (Apache Kafka)ను రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. 2014లో లింక్డ్‌ఇన్‌ను వీడి, ఇద్దరు సహోద్యోగులతో కలిసి కాన్‌ఫ్లూయెంట్‌ను స్థాపించారు. సంస్థలో నేహాకు ఆరు శాతం వాటా ఉన్నట్లు ఫోర్బ్స్ తెలిపింది. 

ఇంద్రా నూయీ: 350 మిలియన్‌ డాలర్ల సంపదతో 77వ స్థానంలో ఉన్నారు. 2019లో ఆమె పెప్సికో నుంచి పదవీ విరమణ చేశారు. 24 ఏళ్ల పాటు సంస్థలో అత్యున్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహించిన ఇంద్రా నూయీ.. పెప్సికో ఆదాయాన్ని పెంచారు. ఆరోగ్యకరమైన ఉత్పత్తులను పరిచయం చేయడంతోపాటు, పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రవేశపెట్టినట్లు ఫోర్బ్స్‌ వెల్లడించింది. 2019లో పెప్సికో నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత నుంచి అమెజాన్‌లో బోర్డు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. 

ఇక ఈ జాబితాలో మొదటి స్థానంలో ఏబీసీ సప్లై సహా వ్యవస్థాపకురాలు డైనీ హెండ్రిక్స్(Daine Hendricks) చోటు సంపాదించుకున్నారు. ఆమె ఈ ఘనత సాధించడం వరుసగా ఆరోసారి. ప్రస్తుతం ఆమె నికర ఆస్తుల విలువ 15 బిలియన్‌ డాలర్లు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని