జేఎస్‌ డబ్ల్యూఎనర్జీ చేతికి మైత్రా విద్యుత్తు ప్రాజెక్టులు

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మైత్రా ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి 1,753 మెగావాట్ల సామర్థ్యం గల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను జేఎస్‌డబ్ల్యూ గ్రూపు కొనుగోలు చేయనుంది. ఇందులో 1,331 మెగావాట్ల సామర్థ్యం గల 10 పవన విద్యుత్తు ప్రాజెక్టులు, 422 మెగావాట్ల సామర్థ్యం గల

Published : 11 Aug 2022 05:53 IST

లావాదేవీ విలువ రూ.10,530 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మైత్రా ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి 1,753 మెగావాట్ల సామర్థ్యం గల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను జేఎస్‌డబ్ల్యూ గ్రూపు కొనుగోలు చేయనుంది. ఇందులో 1,331 మెగావాట్ల సామర్థ్యం గల 10 పవన విద్యుత్తు ప్రాజెక్టులు, 422 మెగావాట్ల సామర్థ్యం గల 7 సౌర విద్యుత్తు ప్రాజెక్టులు, మరొక అనుబంధ ఎస్పీవీ (స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌) సంస్థ ఉన్నాయి. దేశంలోని దక్షిణ, మధ్య, పశ్చిమ భారతదేశంలో ఈ ప్రాజెక్టులున్నాయి. ఈ ప్రాజెక్టులను రూ.10,530 కోట్ల సంస్థాగత విలువకు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కొనుగోలు చేస్తోంది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ ఈ మేరకు మైత్రా ఎనర్జీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది.

18 అనుబంధ కంపెనీలూ..:  మైత్రా ఎనర్జీకి చెందిన 18 అనుబంధ కంపెనీల కింద ఈ ఇంధన ప్రాజెక్టులున్నాయి. చట్టపరమైన లాంఛనాలన్నీ పూర్తయ్యాక, ఈ 18 అనుబంధ కంపెనీలూ మైత్రా నుంచి జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ కిందకు వస్తాయి. ముఖ్యంగా కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 2021-22లో ఈ అనుబంధ కంపెనీలు రూ.1,467 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి.
2025కు 10 గిగావాట్ల లక్ష్యం: జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 10 గిగావాట్లు, 2030 కల్లా 20 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది. మైత్రా ఎనర్జీ నుంచి కొనుగోలు చేస్తున్న ప్రాజెక్టులతో, 2025కు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోడానికి వీలు కలుగుతుందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీకి 4,784 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉండగా, ఈ లావాదేవీతో కలిపి మొత్తం 6,537  మెగావాట్ల సామర్థ్యాన్ని సాధించినట్లు అవుతుంది. దీనికి తోడు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ సొంతంగా నిర్మిస్తున్న 2,500 మెగావాట్ల ప్రాజెక్టులు రెండేళ్లలో పూర్తవుతాయని అంచనా. వాటితో కలిపి ఈ సంస్థ 9 గిగావాట్ల సామర్థ్యాన్ని అధిగమించినట్లు అవుతుంది. ఇందులో పునరుత్పాదక ఇంధన విద్యుత్తు ప్రాజెక్టుల వాటాయే 65% ఉండటం ప్రత్యేకత.
గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులూ  చేపడతాం :  తమ విద్యుత్తు ప్రాజెక్టుల సంఖ్యను, సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోడానికి తమకు అవకాశం లభించినట్లు, మైత్రా ఎనర్జీ ప్రాజెక్టులను కొనుగోలు చేయడం వల్ల తమ వాటాదార్లకూ మేలు జరుగుతుందని జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ జాయింట్‌ ఎండీ ప్రశాంత్‌ జైన్‌ అన్నారు. దేశవ్యాప్తంగా తమకు విద్యుత్తు యూనిట్లు ఉన్నట్లు అవుతుందని పేర్కొన్నారు. మరికొన్ని అవకాశాలు సమీప భవిష్యత్తులో లభిస్తే, వాటిని కూడా అందిపుచ్చుకుంటామని స్పష్టం చేశారు. దీంతోపాటు గ్రీన్‌ హైడ్రోజన్‌ విభాగంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని