Published : 12 Aug 2022 03:13 IST

నవ లిమిటెడ్‌ ఆకర్షణీయమైiన ఫలితాలు

రూ.339 కోట్ల త్రైమాసిక లాభం

82.1 శాతం పెరిగిన ఆదాయం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా విద్యుత్తు, ఫెర్రో అల్లాయ్స్‌ ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్‌ (ఇటీవలి వరకూ నవ భారత్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం రూ.1113.9 కోట్ల ఆదాయం, రూ.339 కోట్ల నికరలాభం ఈ మొదటి త్రైమాసికంలో నమోదయ్యాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.611.5 కోట్లు, నికరలాభం రూ.38.5 కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం. దీంతో పోల్చితే ప్రస్తుత మొదటి త్రైమాసికంలో ఆదాయం 82.1 శాతం, నికరలాభం 781.6 శాతం పెరిగినట్లు అవుతోంది.

స్టాండ్‌ అలోన్‌ ఖాతాల ప్రకారం నవ లిమిటెడ్‌ ప్రస్తుత మొదటి త్రైమాసికంలో రూ.523.9 కోట్ల ఆదాయాన్ని, రూ.176.6 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది.

ఫెర్రో అల్లాయ్స్‌ ఆదాయాలు పెరగటం, విద్యుదుత్పత్తి కార్యకలాపాల నుంచి ఆకర్షణీయమైన ఆదాయాలు లభించటంతో ఈ మొదటి త్రైమాసికంలో అధిక లాభాలు ఆర్జించే అవకాశం వచ్చినట్లు నవ లిమిటెడ్‌ సీఈఓ అశ్విన్‌ దేవినేని వివరించారు. ఫెర్రో అల్లాయ్స్‌ ఆదాయాలు 40 శాతం, విద్యుత్తు ఆదాయాలు 62 శాతం పెరిగినట్లు తెలిపారు. జాంబియాలో పవర్‌ ప్లాంటు కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నట్లు, ఈ మొదటి త్రైమాసికంలో 89 శాతం పీఎల్‌ఎఫ్‌ (ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌) సాధించినట్లు వెల్లడించారు. జెస్కో (జాంబియా ఎలక్ట్రిసిటీ సప్లై కార్పొరేషన్‌ లిమిటెడ్‌) తో సవరించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఫలితంగా దీర్ఘకాలంలో ఉత్పత్తి కార్యకలాపాలు స్థిరంగా కొనసాగే అవకాశం ఏర్పడిందని, తత్ఫలితంగా ఆదాయాలు పెరుగుతాయని పేర్కొన్నారు. జెస్కోతో ఒప్పందాన్ని సవరించుకున్న నేపథ్యంలో దాదాపు 413 మిలియన్‌ డాలర్ల రుణాన్ని పునర్‌వ్యవస్థీకరించాలని ఎంసీఎల్‌ (మాంబా కాలరీస్‌ లిమిటెడ్‌) కోరినట్లు, ఈ వ్యవహారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిష్కారం కావచ్చని ఆశిస్తున్నట్లు తెలిపారు.
మరోపక్క, హైదరాబాద్‌లో కంపెనీకి ఉన్న భూమిపై న్యాయవివాదాలు ఇటీవల పరిష్కారమైన నేపథ్యంలో ఈ భూమిని విక్రయించాలని కంపెనీ యాజమాన్యం ఆలోచిస్తోంది. ఈ ప్రక్రియ కూడా త్వరలో పూర్తవుతుందని ఆశిస్తున్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని