అదానీ రూ.30,100 కోట్ల ఓపెన్‌ ఆఫర్‌

దేశీయ సిమెంటు తయారీ సంస్థలు ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌ కంపెనీల్లో 26% చొప్పున వాటాల కొనుగోలు నిమిత్తం అదానీ గ్రూపు ఇచ్చిన రూ.30,100 కోట్ల ఓపెన్‌ ఆఫర్‌కు సెబీ నుంచి అనుమతులు లభించాయని విశ్వసనీయ సమాచారం.

Published : 20 Aug 2022 02:37 IST

అంబుజా షేరు రూ.385, ఏసీసీ రూ.2,300 చొప్పున కొనుగోలు

దిల్లీ: దేశీయ సిమెంటు తయారీ సంస్థలు ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌ కంపెనీల్లో 26% చొప్పున వాటాల కొనుగోలు నిమిత్తం అదానీ గ్రూపు ఇచ్చిన రూ.30,100 కోట్ల ఓపెన్‌ ఆఫర్‌కు సెబీ నుంచి అనుమతులు లభించాయని విశ్వసనీయ సమాచారం. అంబుజా షేరును రూ.385, ఏసీసీ షేరును రూ.2,300 చొప్పున అదానీ గ్రూపు కొనుగోలు చేయనుందని సంబంధిత వర్గాలు తెలిపినట్లు ఆంగ్లపత్రికలు వెల్లడించాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ నిబంధనల ప్రకారం.. దేశీయ కంపెనీలో 25 శాతానికి మించి వాటా కొనుగోలు చేసే సంస్థ, తప్పనిసరిగా మరో 26% వాటా కొనుగోలుకు ఓపెన్‌ ఆఫర్‌ చేయాలి. ఇందువల్ల ముందుగానే నిర్ణయించిన ధరకు మైనార్టీ వాటాదార్లు కొత్త పెట్టుబడిదారుకు తమ షేర్లను విక్రయించుకోవచ్చు.

* అంబుజా సిమెంట్స్‌ షేరుకు ఆఫర్‌ చేసిన ధర శుక్రవారం ముగింపు (బీఎస్‌ఈలో రూ.420.10) కంటే 8% తక్కువ కాగా.. ఏసీసీ షేరుకు ఆఫర్‌ చేసిన ధర శుక్రవారం ముగింపు నాటి  రూ.2351.60 కంటే 2% తక్కువ అని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. అదానీ ఓపెన్‌ ఆఫర్‌ ప్రక్రియకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, డాయిష్‌ బ్యాంక్‌లు సలహాదార్లుగా ఉన్నాయి. ఈ కొనుగోలు లావాదేవీలు పూర్తయితే.. దేశంలో రెండో అతిపెద్ద సిమెంటు తయారీ సంస్థగా అదానీ గ్రూపు అవతరిస్తుంది.
అదానీ పవర్‌ చేతికి డీబీ పవర్‌!
డీబీ పవర్‌ లిమిటెడ్‌ను రూ.7,017 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు అదానీ పవర్‌ వెల్లడించింది. చత్తీస్‌గఢ్‌లోని జంజ్గిర్‌ చంపా జిల్లాలో 1200 మెగావాట్ల (2శ్రీ600) థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటును డీబీ పవర్‌ కలిగి ఉంది.  923.50 మెగావాట్ల సామర్థ్యానికి దీర్ఘ, మధ్యకాలిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు ఈ సంస్థ చేతిలో ఉన్నాయి. 2022 అక్టోబరు 31 నాటికి ఈ కొనుగోలు లావాదేవీని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నామని, పరస్పర ఆమోదంతో ఈ గడువును పొడిగించుకునే వీలూ ఉందని కంపెనీ తెలిపింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో డీబీ పవర్‌ టర్నోవరు వరుసగా రూ.3,488 కోట్లు (2021-22), రూ.2,930 కోట్లు (2020-21), రూ.3,126 కోట్లు (2019-20)గా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని